Bandi Sanjay Emotional Comments | తన రాజకీయ భవిష్యత్తు మరియు కేంద్ర మంత్రి పదవిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు.
మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. సంజయ్‌తో సెల్ఫీలు దిగేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు.
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సీనియర్ నేత ఎన్వీ సుభాష్ లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్నవన్నీ ఫేక్ వార్తలేనని కొట్టిపారేశారు.
కాషాయ జెండాయే నా శ్వాస..
తాను కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
“ఉరిశిక్ష వేసే ముందు మీ చివరి కోరిక ఏంటని బీజేపీలో కమిట్ మెంట్‌తో పనిచేసే ఏ సాధారణ కార్యకర్తను అడిగినా చెప్పేది ఒక్కటే.. ‘నేను చచ్చిపోయాక నా శవంపై కాషాయ జెండా కప్పాలి’ అని. నాది కూడా అదే చివరి కోరిక.
బండి సంజయ్ అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు, కార్యకర్తలకు తెలుసు. ఇలాంటి ఫాల్తుగాళ్లు చేసే ప్రచారానికి నేను అస్సలు స్పందించను” అని ఎమోషనల్‌గా పేర్కొన్నారు.
కేంద్రం ఏమైనా బీఆర్ఎస్ ఎంపీలతో నడుస్తోందా..
కేంద్ర క్యాబినెట్ నుండి తనను బర్తరఫ్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై బండి సంజయ్ తనదైన శైలిలో కేసీఆర్, కేటీఆర్‌లపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“తెలంగాణలో బీఆర్ఎస్కు ఏమైనా 17 మంది ఎంపీలు ఉన్నారా? వాళ్ల మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందా?
బహుశా నన్ను కేంద్ర మంత్రి పదవి నుండి తీసేయాలనే నిర్ణయం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆరే తీసుకున్నట్టున్నారు. ఇంకా ఏమేం చేయబోతున్నారో వాళ్లనే అడగండి” అంటూ ఎద్దేవా చేశారు.
గడీల పాలన బద్దలు కొట్టాం..
తన అరెస్ట్ వార్తలపై స్పందిస్తూ.. “కేసీఆర్ కొడుకు విసిరే చిల్లర మెతుకులకు ఆశపడి ఒకటి రెండు ఛానళ్లు ఇట్లాంటి కథనాలు వేస్తూ రాక్షసానందం పొందుతున్నాయి.
పదేళ్ల బీఆర్ఎస్ గడీల పాలనను, కేసీఆర్ కుటుంబ అవినీతి సామ్రాజ్యాన్ని బొందపెట్టామనే ఆక్రోశం, అధికారం పోయిందనే కోపం వాళ్లకుంది. అందుకే నాపై ఈ విషప్రచారం” అని మండిపడ్డారు.
భగీరథ్ వివాదంపై క్లారిటీ..
తన కొడుకు భగీరథ్ విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరెస్ట్ కాకుండా జాప్యం చేశారనే ఆరోపణలను కేంద్ర మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందంటూనే.. “కన్న కొడుకును ఏ తండ్రైనా నేరుగా పోలీసులకు అప్పగిస్తారా?
కానీ నేను ప్రజల మధ్య ఉన్నవాడిని కాబట్టి, విచారణకు సహకరిస్తూ నా కొడుకును నేనే స్వయంగా పోలీసులకు అప్పగించా” అని గుర్తుచేశారు.
కేటీఆర్ నడుపుతున్న ‘ఫేక్ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్ మీడియాలో ఎన్ని కథలు వండివార్చినా జనం నవ్వుకుంటున్నారని, ప్రజలు ఎప్పుడూ బీజేపీ వైపే ఉంటారని బండి సంజయ్ స్పష్టం చేశారు.







