Thursday 9th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మధుమేహ చికిత్సలో విప్లవం.. వారానికి ఒకే ఒక్క ఇంజెక్షన్!

మధుమేహ చికిత్సలో విప్లవం.. వారానికి ఒకే ఒక్క ఇంజెక్షన్!

  • ప్రపంచంలోనే తొలిసారి ‘అవిక్లి’ ఇన్సులిన్‌ను విడుదల చేసిన నోవో నార్డిస్క్!

Weekly Once Insulin Awiqli | మధుమేహం (డయాబెటిస్) ఉన్న రోగులకు రోజువారీ సూది నొప్పి నుండి ఎట్టకేలకు విముక్తి లభించనుంది.

డానిష్ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘నోవో నార్డిస్క్’ (Novo Nordisk), టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ ఉన్న పెద్దల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వారానికి ఒకసారి మాత్రమే తీసుకునే బేసల్ ఇన్సులిన్ ‘అవిక్లి’ (Awiqli – ఇన్సులిన్ ఐకోడెక్) ను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.

దీనివల్ల రోగులు ఏడాదికి తీసుకునే ఇంజెక్షన్ల సంఖ్య ఏకంగా 365 నుండి కేవలం 52 కి తగ్గిపోనుంది. ఇది మధుమేహ చికిత్సా విధానంలోనే ఒక చారిత్రాత్మక మార్పుగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.

‘ఇంజెక్షన్ల భయానికి’ చెక్..

మన శరీరంలో గ్లూకోజ్ (చక్కెర) రక్తప్రవాహంలో పేరుకుపోకుండా నిరోధించి, దానిని కణాలలోకి చేరవేసే హార్మోనే ఇన్సులిన్. టైప్ 1 లేదా ముదిరిన టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి రోజుకు ఒకసారి లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే, డయాబెటిస్ ఔషధమైన ‘సెమాగ్లుటైడ్’ (Semaglutide) తో సంచలనం సృష్టించిన నోవో నార్డిస్క్, ఈ కొత్త ఇన్సులిన్‌ను ప్రత్యేకంగా భారతీయుల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు తెలిపింది.

భారతదేశంలో ఇన్సులిన్ వాడకాన్ని ప్రారంభించడంలో ఉన్న అతిపెద్ద అడ్డంకి ప్రతిరోజూ ఇంజెక్షన్లు తీసుకోవాలనే భయం. ఈ సూది భయం కారణంగా రోగులు సగటున ఏడు నుండి తొమ్మిది సంవత్సరాలు ఇన్సులిన్ చికిత్సను ఆలస్యం చేస్తున్నారని, ఇది వారి ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతోందని కంపెనీ పేర్కొంది.

పెన్ పరికరం ద్వారా చికిత్స సులభం..

ప్రతిరోజూ వాడే సంప్రదాయ ఇన్సులిన్‌ల లాగా కాకుండా, ‘అవిక్లీ’ని ‘ఫ్లెక్స్‌టచ్’ (FlexTouch) అనే ప్రత్యేక పెన్ పరికరం ద్వారా వారానికి ఒకసారి మాత్రమే ఇస్తారు. ఈ సులభమైన విధానం వల్ల రోగులు చికిత్సను క్రమం తప్పకుండా పాటించే అవకాశం పెరుగుతుంది.

భారతదేశంలో తీవ్రంగా ఉన్న డయాబెటిస్ భారం..

ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) గణాంకాల ప్రకారం, దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో డయాబెటిస్ తీవ్రత ఆందోళనకరంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్ (ICMR), మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం..

దేశంలో డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ప్రతి ముగ్గురిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఆ వ్యాధి నియంత్రణలో ఉంటోంది.

దేశంలో దాదాపు 10.1 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. సుమారు 13.6 కోట్ల మంది ప్రీడయాబెటిస్ (వ్యాధి వచ్చే ముందు దశ) లో ఉన్నారు.

9 లక్షలకు పైగా ప్రజలు ఇన్సులిన్ థెరపీపైనే ఆధారపడే ‘ఆటోఇమ్యూన్’ టైప్ 1 డయాబెటిస్‌తో ఉన్నారు. జీవక్రియల లోపం వల్ల వచ్చే టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో సుమారు 10 శాతం మందికి ఇన్సులిన్ తప్పనిసరి.

ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 ఇన్సులిన్ బ్రాండ్లలో (మిక్స్‌టార్డ్, రైజోడెగ్ వంటివి) నాలుగు నోవో నార్డిస్క్ సంస్థవే కావడం విశేషం. ఈ సరికొత్త చికిత్సను దేశవ్యాప్తంగా విస్తృతంగా సరఫరా చేయడానికి కంపెనీ ‘అబాట్’ (Abbott) సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది.

క్లినికల్ ట్రయల్స్ లో మెరుగైన ఫలితాలు..

‘ఆన్‌వార్డ్స్-1’ (ONWARDS-1) క్లినికల్ ట్రయల్స్ డేటా ప్రకారం.. ప్రస్తుతం రోజువారీగా వాడుతున్న ‘ఇన్సులిన్ గ్లార్జైన్ U100’ తో పోలిస్తే ఈ వారానికి ఒకసారి తీసుకునే ‘అవిక్లి’ ఇన్సులిన్ అత్యుత్తమ ఫలితాలను ఇచ్చింది. ఇది మూడు నెలల సగటు చక్కెర శాతాన్ని తెలిపే HbA1c స్థాయిలను మెరుగ్గా తగ్గించింది.

రోజులో ఎక్కువ సమయం చక్కెర స్థాయిలు సాధారణ పరిధిలోనే ఉండేలా చూసే “టైమ్ ఇన్ రేంజ్” (Time in Range) ను మెరుగుపరిచింది. టైప్ 2 రోగులలో ప్రాణాంతక ‘హైపోగ్లైసీమియా’ (రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవడం) సమస్య లేకుండానే, HbA1c స్థాయిలను 7 శాతం కంటే తక్కువకు విజయవంతంగా తగ్గించింది.

“భారతదేశ డయాబెటిస్ సంరక్షణ రంగంలో ఈ ప్రారంభోత్సవం ఒక కీలక మైలురాయి. వారానికి ఒకసారి మాత్రమే డోసింగ్ ఉండటం వల్ల రోగులలో ఇన్సులిన్ పట్ల ఉండే శారీరక, మానసిక అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి” అని నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఎస్.కె. వాంగ్నూ కూడా మాట్లాడుతూ.. చికిత్సను సులభతరం చేసే ఇటువంటి ఆవిష్కరణలు రోగులకు సకాలంలో వైద్యం అందేలా చేయడంలో దీర్ఘకాలిక అంతరాన్ని పూడుస్తాయని స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions