Wednesday 25th November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాదీ మహిళ!

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాదీ మహిళ!

  • విక్టోరియా అసెంబ్లీకి పోటీ పడుతున్న డాక్టర్ లక్ష్మీ లంకల కెందెర్ల!
  • నవంబర్ 28న పోలింగ్

Telugu Woman Contests Australian Elections ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర అసెంబ్లీ (Victorian Legislative Assembly) ఎన్నికల బరిలో హైదరాబాద్ మూలాలున్న డాక్టర్ లక్ష్మీ లంకల కెందెర్ల (Laxmi Lankala Kenderla) నిలిచారు. నవంబర్ 28, 2026న జరగనున్న విక్టోరియా రాష్ట్ర ఎన్నికల్లో సైడెన్‌హామ్ (Sydenham District) నియోజకవర్గం నుంచి ‘ది రిపబ్లికన్’ (The Republican) పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నట్లు విక్టోరియన్ ఎలక్టోరల్ కమిషన్ (VEC) అధికారిక జాబితా వెల్లడించింది.

దిగువ సభ అయిన విక్టోరియా లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆమె పోటీ పడుతుండటం ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు సమాజంలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బ్యాలెట్ పేపర్‌పై లక్ష్మి మూడో స్థానంలో ఉన్నారు.

నారాయణగూడ నుంచి ఆస్ట్రేలియా రాజకీయాల వరకు..

లక్ష్మి హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్ అండ్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలో ఎంబీబీఎస్ (MBBS) పట్టా పొందారు. ఆమె తల్లి ఎల్.కె. జయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివసిస్తున్నారు. కర్ణాటకకు చెందిన మల్లేష్‌ను వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మి తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. తెలంగాణ మూలాలున్న లక్ష్మి విక్టోరియా ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా ఆస్ట్రేలియా రాజకీయ ప్రక్రియలో భారత సంతతి ప్రజల భాగస్వామ్యం మరింత పెరుగుతోందని ప్రవాస సంఘాలు పేర్కొంటున్నాయి.

పోలీసింగ్, రవాణా, వైద్యమే ప్రధాన ప్రచార అంశాలు..

తన ఎన్నికల ప్రచార పత్రాల్లో స్థానిక సమాజ భద్రత (Community Safety), రవాణా, విద్య, ఆరోగ్య రంగాలను ప్రధాన అంశాలుగా లక్ష్మి పేర్కొన్నారు. నేరాల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు, ఫ్రంట్‌లైన్ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె ప్రచారంలో పేర్కొన్నారు. మెరుగైన రోడ్లు, సురక్షితమైన కూడళ్లు (Intersections), నమ్మకమైన ప్రజా రవాణా సేవలు, అనుసంధానత (Connectivity) పెంచడం తన ప్రాధాన్యతలని తెలిపారు.

పాఠశాలల్లో మెరుగైన వసతులు, వనరుల కల్పనతో పాటు ఆసుపత్రులు, జనరల్ ప్రాక్టీషనర్లు, అత్యవసర వైద్య సేవలు ప్రజలకు మరింత సులభంగా అందాలని ఆమె ఆకాంక్షించారు. “మీ సమస్యలను వినడానికి, మన సమాజం తరఫున నిలబడటానికి మరియు సైడెన్‌హామ్ నియోజకవర్గ మెరుగైన భవిష్యత్తు కోసం పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని లక్ష్మి తన ఎన్నికల ప్రచార సందేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions