Kayadu Lohar Water Bottle Sold On OLX సినిమా నటీనటులపై అభిమానం ఉండటం సహజమే. తమకు ఇష్టమైన హీరోహీరోయిన్ల సినిమాలను చూడటం, సోషల్ మీడియాలో వారిని ఫాలో అవ్వడం వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, కొంతమంది అభిమానం పేరుతో చేసే అతి చేష్టలు ఒక్కోసారి హద్దులు దాటి వికృత రూపం దాల్చుతుంటాయి. తాజాగా కేరళలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన ఘటనే ఇందుకు నిదర్శనం.
ప్రముఖ నటి కయాదు లోహర్ (Kayadu Lohar) షూటింగ్ సమయంలో తాగి పడేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను కేరళకు చెందిన ఒక వీరాభిమాని ఏకంగా ‘OLX’ ఆన్లైన్ వేదికగా అమ్మకానికి పెట్టాడు. సాధారణంగా పాత వస్తువులను అమ్ముకునే ఈ ప్లాట్ఫామ్లో అతడు పెట్టిన ప్రకటన చూసి నెటిజన్లు కంగుతిన్నారు.
రూ. 3 లక్షల ఖరీదైన వాటర్ బాటిల్!
“ఇది @KayaduLohar తాగిన ఒరిజినల్ ఇవియాన్ వాటర్ బాటిల్. ఇందులో ఇంకా కొద్దిగా నీరు మిగిలి ఉంది. ఇది కేవలం బాటిల్ కాదు.. ఏకంగా సెలబ్రిటీ టచ్ చేసిన అరుదైన వస్తువు!” అంటూ ఆ వ్యక్తి పెట్టిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అంతేకాకుండా, ఆ ఖాళీ బాటిల్ ధరను అరుదైన పురాతన వస్తువు మాదిరిగా ఏకంగా రూ. 3 లక్షలుగా నిర్ణయించాడు.
ఈ వింత ప్రకటన చూసిన నెటిజన్లు నోరెళ్లబెట్టారు. అభిమానం ఉండాలి కానీ, మరీ ఇలా ఖాళీ వాటర్ బాటిళ్లను అమ్ముకునే స్థాయికి దిగజారడం ఏంటంటూ మండిపడుతున్నారు. మరికొందరైతే “ఇదేం పిచ్చి భయ్యా.. ఆ బాటిల్లో ఉన్న కొద్దిపాటి నీటిని తాగి అమృతం తాగామని ఫీలవుతారేమో!” అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూనే తీవ్ర చర్చకు దారితీసింది.
అతివ్యామోహం.. అజ్ఞానానికి పరాకాష్ట!
సెలబ్రిటీలు వాడిన వస్తువులను, దుస్తులను వేలంలో కొనుగోలు చేయడం పెద్ద పెద్ద సెలబ్రిటీల విషయంలో అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ, ఎక్కడో షూటింగ్ స్పాట్లో పడేసిన చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకొచ్చి లక్షలకు అమ్ముతామనుకోవడం కేవలం మానసిక దివాలాకోరుతనానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యువత ఇలాంటి అర్ధంలేని పిచ్చి పనులకు పోయి తమ విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవడం మానుకోవాలని హితవు పంపుతున్నారు. సెలబ్రిటీలు తెరపై అందంగా కనిపిస్తారేమో కానీ, ఇలాంటి చెత్తను అమ్ముకునే వారిని చూస్తే అభిమానం కాస్తా అసహ్యంగా మారుతుందని నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వింత పోకడలకు స్వస్తి పలికి, ప్రయోజనకరమైన విషయాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.











