- ‘మెగా యూత్ ఫోర్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు!
Chiranjeevi Comments On Blood Bank Criticism తెలుగు చిత్రసీమలో 47 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, తన అభిమాన సంఘాల్లో ఒకటైన ‘మెగా యూత్ ఫోర్స్’ (Mega Youth Force) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వేదికగా అభిమానులతో తనకున్న ప్రేమానుబంధం, 1998 నుంచి నిరంతరాయంగా సాగుతున్న సేవా కార్యక్రమాలు, జీవితంలో వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గతంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణలు, విమర్శలపై చిరంజీవి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నా రెమ్యూనరేషన్ ముందు ఆ డబ్బు ఎంత?
బ్లడ్ బ్యాంకు ద్వారా చిరంజీవి రక్తం అమ్ముకుంటున్నాడని కొందరు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ — “నాకు వచ్చే పారితోషికం (రెమ్యూనరేషన్)తో పోల్చుకుంటే, ఎన్ని ప్యాకెట్ల రక్తం అమ్మితే ఆ డబ్బుకు సమానమో చెప్పండి? వాళ్ళు అనే మాటలు ఎంత మూర్ఖంగా ఉన్నాయో ఆలోచించండి” అని చిరు ప్రశ్నించారు. ఎవరి వద్ద చెయ్యి చాచి డొనేషన్లు తీసుకోకుండా తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నానని తెలిపారు. దీని వెనుక తాను చేసే ఖర్చు కొంతైతే, అభిమానులు అందించే రక్తం, కళ్ల దానం వేలకట్టలేనిదని కొనియాడారు.
రాముడి మాట విన్న లక్ష్మణ భరతుల్లా..
తాను శ్రీకారం చుట్టిన ఈ సేవా యజ్ఞాన్ని అభిమానులు తమ భుజస్కంధాలపై వేసుకుని, శ్రీరాముడి మాటను లక్ష్మణ భరతులు విన్నట్లుగా నడిపిస్తున్నారని మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేశారు. తనకు లభించే అవార్డులు, విజయాల కంటే అభిమానుల సేవ ద్వారా వచ్చే మానసిక సంతృప్తి చాలా గొప్పదని అన్నారు.
అభిమానులకు ‘జాడీ-రాళ్ల’ జీవిత సూత్రం..
అవమానాలు, నెగెటివిటీని ఎలా తీసుకోవాలో అభిమానులకు వివరిస్తూ చిరంజీవి ఒక ఉదాహరణ చెప్పారు: “ఒక జాడీలో ముందుగా ఇసుక వేస్తే… అందులో పెద్ద రాళ్లకు చోటు ఉండదు. ఇక్కడ పెద్ద రాళ్లు మన జీవిత లక్ష్యాలు, గమ్యాలు కాగా… ఇసుక రేణువులు అవమానాలు, నెగెటివిటీ, నిరాశలు. నెగెటివిటీ అనే ఇసుకతో మన మనస్సును నింపేస్తే ప్రధాన లక్ష్యాలను సాధించలేం.” తన జీవితంలో అదృష్టాన్ని నమ్మనని, కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటానని చిరంజీవి స్పష్టం చేశారు.











