KTR on Delimitation Controversy | లోకసభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR) కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గించాలని చూస్తే, అది కేవలం రాజకీయ విబేధాలకే పరిమితం కాదని, దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
అభివృద్ధికి ఇచ్చే బహుమతి ఇదేనా? పునర్విభజన ప్రక్రియపై కేటీఆర్ తన ఆందోళనను వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనాభా నియంత్రణ పాటించి, వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, పార్లమెంటులో వారి స్వరాన్ని అణచివేయడం సరికాదని విమర్శించారు.
ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ ఒకే మాటపై ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. “దక్షిణ భారతీయుల హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పార్లమెంటులో మా ప్రాతినిధ్యాన్ని తగ్గించాలని చూస్తే నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకోం. హక్కుల రక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియ శాస్త్రీయంగా ఉండాలని, కేవలం జనాభాను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం ఒకవేళ మొండిగా ముందుకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు.






