- మేనేజ్‌మెంట్ సంచలన ప్రకటన..
- ఐపీఎల్ 2026 ఘోర పరాజయం వల్లేనా?
Rishabh Pant Steps Down LSG Captain | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ముగిసిన వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫ్రాంచైజీలో భారీ మార్పు చోటుచేసుకుంది. జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ లక్నో కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నారు.
సారథ్య బాధ్యతల నుండి తనను తప్పించాల్సిందిగా పంత్ చేసిన అభ్యర్థనను ఫ్రాంచైజీ యాజమాన్యం తక్షణమే అంగీకరించినట్లు శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో జట్టు అత్యంత ఘోరమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన నేపథ్యంలో పంత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
సీజన్ 2026లో లక్నో ఘోర వైఫల్యం..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధరతో లక్నో జట్టు పంత్‌ను దక్కించుకుంది. అయితే, గత రెండు సీజన్లలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి, 8 పాయింట్లతో టేబుల్ లో 10వ స్థానానికి పరిమితమైంది.
ఈ సీజన్‌లో పంత్ బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్‌లలో 138.05 స్ట్రైక్ రేట్‌తో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా లక్నో కెప్టెన్‌గా రెండు సీజన్లలో కలిపి 28 మ్యాచ్‌లకు గాను 10 విజయాలు, 18 ఓటములను పంత్ చవిచూశాడు.
రిషభ్ పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై లక్నో క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ స్పందించారు. “రిషభ్ స్వయంగా మమ్మల్ని సంప్రదించి ఈ అభ్యర్థనను కోరారు, మేము దానిని గౌరవిస్తూ ఆమోదించాం.
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులువు కాదు. కెప్టెన్‌గా డ్రెస్సింగ్ రూమ్‌కు ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు. ఇప్పుడు మా ఫోకస్ అంతా జట్టును మళ్లీ బలోపేతం చేయడంపైనే ఉంది” అని మూడీ పేర్కొన్నారు.
కొత్త కెప్టెన్ ఎవరు?
లక్నో తదుపరి కెప్టెన్ ఎవరనేది ఫ్రాంచైజీ ఇంకా ప్రకటించలేదు. రాబోయే సీజన్‌లో పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇవ్వడమే లక్ష్యంగా, త్వరలోనే కొత్త కెప్టెన్ వివరాలను వెల్లడిస్తామని మేనేజ్‌మెంట్ తెలిపింది.







