- సోషల్ మీడియాలో తీవ్ర చర్చ!
Woman Asked Family Planning Question In Job Interview కార్పొరేట్ సంస్థలు ఒకవైపు మహిళా సాధికారత, సమానత్వం గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం వివక్ష చూపుతున్నాయనడానికి నిదర్శనంగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. శతాక్షి ద్వివేది అనే యువతికి ఉద్యోగ ఇంటర్వ్యూలో ఎదురైన వైఖరి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో ద్వారా పంచుకున్నారు.
వ్యక్తిగత ప్రశ్నతో హెచ్ఆర్ మైండ్ గేమ్..
శతాక్షి ఇటీవల ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తొలుత నివాసం, ఆఫీసు ప్రయాణ సౌలభ్యం వంటి విషయాలపై హెచ్ఆర్ (HR) ప్రతినిధి ఆరా తీశారు. తన భర్త కూడా అదే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారని, ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె స్పష్టం చేశారు. ఆమెకు వివాహమైందనే విషయం తెలియగానే హెచ్ఆర్ సంభాషణను వ్యక్తిగత విషయాల వైపు మళ్లించారు. “ఏమీ అనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా? మీరు ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచనలో లేరు కదా?” అని నేరుగా ప్రశ్నించారు.
దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు..
ఈ అనూహ్యమైన ప్రశ్నతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని శతాక్షి తెలిపారు. తన కెరీర్లోనే ఇదే అత్యంత అనుచితమైన ప్రశ్న అని వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే సంస్థలే ఇలాంటి వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సదరు సంస్థ పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు.
నెటిజన్లు & మహిళల తీవ్ర స్పందన..
శతాక్షి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఉద్యోగినులు తమకు ఎదురైన అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు. పెళ్లికాని అమ్మాయిలను ‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’, వివాహితులను ‘పిల్లల్ని ఎప్పుడు కంటారు?’, పిల్లలు ఉన్నవారిని ‘పనిని, బిడ్డను ఎలా సమన్వయం చేసుకుంటారు?’ అని ప్రతి దశలోనూ ఇబ్బంది పెడుతున్నారని ఒక నెటిజన్ ఆక్రోశం వెళ్లగక్కారు.
మరొక మహిళ స్పందిస్తూ “నా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి నన్ను కూడా నేరుగా అడిగారు. కార్పొరేట్ రంగంలో మహిళలపై ఇలాంటి పక్షపాత ధోరణి మారకపోవడం విచారకరం” అని కామెంట్ చేశారు.
కార్పొరేట్ ప్రపంచంలో సాధికారత నినాదాలకు, క్షేత్రస్థాయి ఆచరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ సంఘటన మరోసారి ఎత్తిచూపింది.







