RGV AI Truth Bomb ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో ‘ఏఐ ట్రూత్ బాంబ్’ (AI Truth Bomb) పేరుతో సోషల్ మీడియాలో సుదీర్ఘ విశ్లేషణను పంచుకున్నారు. ఏఐని సమర్థవంతంగా ఉపయోగించే వ్యక్తులు, దానిని ఉపయోగించని వారిని కచ్చితంగా భర్తీ చేస్తారని (రీప్లేస్ చేస్తారని) ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగులే తమను తాము రీప్లేస్ చేసుకుంటున్నారు..
“చాలా మంది ఉద్యోగులు ఏఐ తమ ఉద్యోగాలను దొంగిలిస్తోందని గట్టిగా అరుస్తున్నారు. కానీ నిజానికి వారే తమను తాము దొంగిలించుకుంటున్నారు” అని వర్మ వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడ్ రాయడానికి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఐడియాల కోసం, అనలిస్ట్ డేటా విశ్లేషణకు చాట్‌జీపీటీ, క్లాడ్, మిడ్‌జర్నీ వంటి ఏఐ టూల్స్‌ను రహస్యంగా వాడుతున్నారని ఆయన వివరించారు. తాము కష్టపడి చేసినట్టుగా ఆ పనిని పైఅధికారుల ముందు ప్రెజెంట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
గణాంకాలతో కంపెనీలకు తెలిసిపోతోంది..
“ప్రతి ఒక్కరూ దీన్ని రహస్యంగా చేస్తున్నారు, కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. అయితే కంపెనీలకు ఈ విషయం గణాంకాల రూపంలో తెలిసిపోతుంది” అని ఆర్జీవీ అన్నారు. ఏఐ వాడకం వల్ల కంపెనీల అవుట్‌పుట్, నాణ్యత, లాభాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు.
“ఏఐ 24/7 పనిచేస్తుంది, కాఫీ బ్రేక్‌లు తీసుకోదు, అనారోగ్యానికి గురవదు, సహోద్యోగుల గురించి ఫిర్యాదు చేయదు, జీతం అడగదు. అది కేవలం పని చేసి పెడుతుంది” అని వర్మ అభివర్ణించారు.
ఉద్యోగాల కోత వెనుక అసలు నిజం..
కంపెనీల్లో ఉద్యోగాల కోత వచ్చినప్పుడు ఉద్యోగులు షాక్‌కి గురై టెక్నాలజీని, కంపెనీలను నిందిస్తారని.. కానీ వాస్తవానికి ఏఐ వచ్చి ఎవరినీ బయటకు గెంటలేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు రహస్యంగా తమను తాము ఎప్పుడో రీప్లేస్ చేసుకున్నారని, తాము చేయని పనికి జీతం తీసుకుంటూ కూర్చున్నారని ఘాటుగా విమర్శించారు.
భవిష్యత్తులో అదే అసలైన నైపుణ్యం..
భవిష్యత్తులో ఏఐ వాడకాన్ని రహస్యంగా ఉంచడం కాదని, దాన్ని బాహాటంగా, దూకుడుగా, ఎలాంటి అపరాధ భావన లేకుండా ఉపయోగించడమే అసలైన నైపుణ్యం అవుతుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. భవిష్యత్తు ఎలా ఉన్నా ఒక కఠినమైన వాస్తవం ఏమిటంటే.. ఏఐని ఉపయోగించే వ్యక్తులు, దానిని ఉపయోగించని వారి స్థానాన్ని భర్తీ చేస్తారని ఆయన తన పోస్ట్‌ను ముగించారు.







