- సమర్పించిన చెన్నై దంపతులు!
Record Gold Donation To TTD తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలోనే ఒక వ్యక్తిగత భక్తుడు సమర్పించిన అతిపెద్ద విరాళం నమోదైంది. చెన్నైకి చెందిన భక్తులు వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు గురువారం (నవంబర్ 26) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీవారికి దాదాపు రూ. 208 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాలను కానుకగా సమర్పించారు.
విరాళంలోని ఆభరణాల ప్రత్యేకతలు..
తొమ్మిది సెట్లలో 46 ఆభరణాలు: ఈ విరాళంలో శ్రీవారి కిరీటం, పద్మ పాదాలు, బంగారు పులిగోరు, వివిధ రకాల హారాలు, రత్నాలతో కూడిన 9 సెట్లలో మొత్తం 46 రకాల ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు 238.2 క్యారెట్ల వజ్రాలను కూడా సమర్పించారు. మొత్తం 121 కిలోల బంగారు ఆభరణాలలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి 106 కిలోల ఆభరణాలు, శ్రీ పద్మావతి అమ్మవారికి 15 కిలోల బంగారు వస్త్రాన్ని (Costume) జైన్ దంపతులు అందజేశారు.
శ్రీకృష్ణదేవరాయల నుంచి నేటి వరకు భక్తి పరంపర: సీఎం చంద్రబాబు
ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకోవడం తన అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భారీ విరాళం అందించిన జైన్ దంపతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారికి నిత్యం 120 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరణ జరుగుతుందని గుర్తుచేసిన సీఎం.. ప్రాచీన కాలంలో పల్లవ, చేర, చోళ, పాండ్య రాజులతో పాటు మైసూరు మహారాజులు, మరాఠా పాలకులు తిరుమల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన రత్న కిరీటం, పీతాంబరాలకు ఎంతో చరిత్ర ఉందని, నాటి నుంచి నేటి జైన్ దంపతుల వరకు శ్రీవారిపై భక్తిభావం నిరంతరం పెరుగుతూనే ఉందని అన్నారు.

5,000 ఆలయాల నిర్మాణం..
టీటీడీ అత్యంత పారదర్శకమైన సంస్థ అని కొనియాడిన చంద్రబాబు, భక్తుల కోసం ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తోందని తెలిపారు. టీటీడీ సహకారంతో 5,000 ఆలయాలను నిర్మిస్తామని, ఆలయం ఉన్న ప్రతిచోటా అన్నప్రసాదం అందించాలని పిలుపునిచ్చారు. అలాగే హిందువులు అధికంగా నివసించే విదేశాల్లోనూ ఆలయాలు నిర్మించాలని పేర్కొన్నారు. గోసంరక్షణ, ఆలయ పవిత్రతను కాపాడటంలో టీటీడీ ముందుండాలని ఆకాంక్షించారు.







