Wednesday 25th November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘సొంతంగా ఎదగాలనుకుంటే మోదీజీతో నడువు’

‘సొంతంగా ఎదగాలనుకుంటే మోదీజీతో నడువు’

  • నాడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీయే తనకు సలహా ఇచ్చారన్న పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి!

Suvendu Adhikari Claims Pranab Mukherjee Advised Him To Join PM Modi భారత మాజీ రాష్ట్రపతి, దివంగత కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీని వీడి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బీజేపీ వైపు వెళ్లాలని నాడు రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్ ముఖర్జీయే తనకు సలహా ఇచ్చారని సువేందు అధికారి వెల్లడించారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో ఆనాడు ఏం జరిగింది?

తనకు మార్గదర్శి, అసలైన సలహాదారు ప్రణబ్ ముఖర్జీయేనని సువేందు అధికారి పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తాను రాష్ట్రపతి భవన్‌లో ఆయన్ను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ భేటీలో ప్రణబ్ ముఖర్జీ తనతో మాట్లాడుతూ.. “నువ్వు ఇంకా ఓ ఉద్యోగిలా మిగిలిపోవాలనుకుంటే అక్కడే ఉండు.. సొంతంగా ఎదగాలనుకుంటే మోదీజీతో నడువు” అని సూచించినట్లు సువేందు వివరించారు.

టీఎంసీ పార్టీ అత్తా-అల్లుళ్ల ప్రైవేట్ కంపెనీలా నడుస్తోందని, వారు మేనేజింగ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లా వ్యవహరిస్తున్నారని ప్రణబ్ ముఖర్జీ ఆనాడే అభిప్రాయపడ్డారని సువేందు చెప్పారు. తాను కేవలం ఒక ఉద్యోగిలా ఉండటం ఇష్టం లేకే టీఎంసీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. అయితే ఆ భేటీ జరిగిన నిర్దిష్ట తేదీని వెల్లడించేందుకు సువేందు నిరాకరించారు. దివంగత నేత చుట్టూ అనవసర వివాదాలు రావడం తనకు ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు.

నందిగ్రామ్ ఉద్యమం నుంచి బెంగాల్ సీఎం పీఠం వరకు..

టీఎంసీలో నందిగ్రామ్ ఉద్యమం ద్వారా అగ్రనేతగా ఎదిగిన సువేందు అధికారి, పార్టీలో అభిషేక్ బెనర్జీ ప్రాబల్యం పెరిగిన తర్వాత 2020లో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్‌లోనూ ఆమెపై విజయం సాధించి పశ్చిమ బెంగాల్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జీవితకాలం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ వైపు వెళ్లాలని సూచించారంటూ సువేందు అధికారి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

You may also like
Rahul Gandhi on Women's Reservation Bill 2026
రాజీవ్ గాంధీ హత్య వెనుక కుట్ర.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
ఆ రాష్ట్రం పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
తల్లిని కోల్పోయిన వేళ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగ లేఖ!
ఇటలీ నేత ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ నినాదం.. వీసా నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం సీరియస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions