Italian Politician Giacomo Filibeck Bharat Summit Controversy హైదరాబాద్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 13–14 తేదీల్లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ (Bharat Summit) లో ఇటలీ రాజకీయ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. సమ్మిట్‌లో ప్రసంగిస్తూ ఆయన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ (Vote Chor, Gaddi Chhod) అంటూ నినదించడంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాన్ఫరెన్స్ వీసా (Conference Visa) పై భారత్‌కు వచ్చిన విదేశీ పౌరులు దేశీయ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వీసా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
వివాదానికి దారితీసిన పరిణామాలు..
కాన్ఫరెన్స్ వీసాపై వచ్చి రాజకీయ వ్యాఖ్యలు: పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (PES) సెక్రటరీ జనరల్ అయిన ఫిలిబెక్.. కేవలం సదస్సులో పాల్గొనేందుకు ఉద్దేశించిన కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చారు. ఏ వీసాపై వచ్చినా విదేశీయులు భారత అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యానించకూడదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
రాహుల్ నినాదాన్ని అందుకున్న ఇటలీ నేత..
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఎన్నికల ప్రక్రియపై విమర్శలు చేస్తూ పాపులర్ చేసిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ నినాదాన్ని ఫిలిబెక్ సదస్సులో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ సూత్రాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని మద్దతు పలికారు. ఆ సమయంలో వేదికపై ఉన్న రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టడం వివాదాన్ని మరింత పెంచింది.
అమిత్ షా, బీజేపీ, బీఆర్ఎస్ నేతల తీవ్ర ఆగ్రహం..
విదేశీ సదస్సుల్లో భారత్‌ను, దేశ ప్రజాస్వామ్య సంస్థలను అప్రతిష్టపాలు చేయడం వల్ల రాహుల్ గాంధీ అధికారంలోకి రాలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాహుల్ గాంధీ విదేశీ ప్రతినిధులు, జార్జ్ సోరోస్ సన్నిహితులతో చేతులు కలిపారని, విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్ వేదికగా విమర్శించారు.
భారత అంతర్గత రాజకీయాలపై మాట్లాడేందుకు విదేశీ నేతను కాంగ్రెస్ ఎందుకు అనుమతించిందని బీఆర్ఎస్ నేత కార్తీక్ ఇంద్రారెడ్డి పట్లోళ్ల ప్రశ్నించారు. మరోవైపు శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఇటలీ నేత వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనితో భేటీ అయినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని బీజేపీని ప్రశ్నించారు.










