- హైదరాబాద్‌పైనా కన్నేసిన ‘వెల్‌ఫెడ్’!
Bengaluru Couple Wellfed Meal ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఒక సాధారణ సమస్యే బెంగళూరుకు చెందిన దియా కృష్ణకుమార్, ఆదిత్య నటరాజన్ దంపతులను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మార్చింది. ఆఫీసులో సుదీర్ఘ సమయం పనిచేశాక ఇంటికి వచ్చి వంట చేసుకోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. బయట ఫుడ్ ఆర్డర్ చేద్దామంటే ఆరోగ్యకరం కాదు.. ఇంట్లో వండుకుందామంటే సమయం ఉండదు.
తమకు కావాల్సినట్లుగా ఇంటి భోజనం లాంటి ఆరోగ్యకరమైన, బడ్జెట్‌కు తగిన మీల్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఏదీ కనిపించకపోవడంతో, వారే స్వయంగా ఆ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 2024 సెప్టెంబర్‌లో తమ ఐటీ ఉద్యోగాలకు రాజీనామా చేసి, బెంగళూరులో ‘వెల్‌ఫెడ్’ (Wellfed) అనే హెల్తీ మీల్ సబ్‌స్క్రిప్షన్ స్టార్టప్‌ను ప్రారంభించారు.
55 వేల భోజనాల పంపిణీ..
కంప్యూటర్ సైన్స్ చదివి ఒకే ఐటీ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఈ దంపతులు, తమ సొంత పొదుపు సొమ్ము రూ. 15 లక్షలతో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆరుగురు సభ్యుల బృందంతో (ఒక న్యూట్రిషనిస్ట్, వంటమనిషి, డెలివరీ బాయ్ తదితరులు) కలిసి అడుగులేశారు. పప్పు, ఆలూ గోబీ, జొన్న రొట్టెలు, అద్రకీ చికెన్, చోళే చాట్ వంటి సాధారణ భారతీయ వంటకాలతో పాటు పనీర్, టోఫూ, సోయా వంటి ప్రొటీన్ ఆధారిత ఆహారాన్ని అందిస్తున్నారు.
వైరల్ రీల్ తెచ్చిన గుర్తింపు..
బెంగళూరుకు చెందిన ఒక న్యూట్రిషనిస్ట్ ‘వెల్‌ఫెడ్’ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక రీల్ వైరల్ కావడంతో, వీరికి ఒక్కసారిగా మొదటి 100 మంది కస్టమర్లు లభించారు. ప్లాస్టిక్‌కు బదులుగా మహారాష్ట్ర నుండి తెప్పించిన స్టీల్ లైనింగ్ రీయూజబుల్ బాక్సులలో భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు.
త్వరలో హైదరాబాద్‌కు విస్తరణ..
మొదటి ఏడాదిలో రూ. 45 లక్షల ఆదాయం సాధించిన ఈ సంస్థ, 2026 జనవరి నుండి సెప్టెంబర్ మధ్య కేవలం 9 నెలల్లోనే రూ. 56 లక్షల రెవెన్యూ నమోదు చేసింది. ఇప్పటివరకు 1,500 మందికి పైగా కస్టమర్లకు 55,000కు పైగా భోజనాలను అందించింది. ప్రస్తుతం మూడు రకాల ప్లాన్లను అందిస్తోంది. 3 రోజుల ట్రయల్ ప్లాన్ (ఒక భోజనం రూ. 289), రెండు వారాల ప్లాన్ (రూ. 279), నెలవారీ ప్లాన్ (రూ. 269) అందుబాటులో ఉన్నాయి. ఇందులో లంచ్, డిన్నర్‌తో పాటు ఫ్రీ డెలివరీ, న్యూట్రిషనిస్ట్ సలహాలు ఉంటాయి.
2026 ప్రారంభంలో ఎల్‌పీజీ (LPG) కొరత వంటి సవాళ్లను అధిగమించిన ఈ స్టార్టప్.. ఇప్పుడు బెంగళూరు అంతటా తమ సేవలను విస్తరించడంతో పాటు, త్వరలోనే హైదరాబాద్ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.







