PM Modi Speech On Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న ఆందోళనలపై పార్లమెంట్‌లో స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తామని ఆయన ‘గ్యారెంటీ’ ఇచ్చారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో, పురుషుల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు లోక్‌సభ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచి 815కు చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం వివరించింది. ఇందులో 272 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.
“దక్షిణాది కావచ్చు, ఉత్తరాది కావచ్చు.. చిన్న రాష్ట్రం లేదా పెద్ద రాష్ట్రం.. ఎవరికీ అన్యాయం జరగదు. గతంలో ఉన్న నిష్పత్తి ప్రకారమే సీట్ల పెంపు ఉంటుంది. దీనిపై నేను హామీ ఇస్తున్నాను” అని ప్రధాని ప్రకటించారు.
క్రెడిట్ నాకొద్దు..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు క్రెడిట్ తనకు లేదా తన పార్టీకి మాత్రమే దక్కాలని తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
“ఈ బిల్లుపై ఎవరైనా క్రెడిట్ తీసుకోవాలనుకుంటే, నేను వారికి ‘బ్లాంక్ చెక్’ ఇస్తాను. బిల్లు ఆమోదం పొందాక ఏ నాయకుడి ఫోటోతో అయినా పూర్తి పేజీ ప్రకటన ఇచ్చుకోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని మోదీ చమత్కరించారు.
మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది వారికి చేస్తున్న సాయం కాదని, అది వారి హక్కు అని ప్రధాని ఉద్ఘాటించారు.
గత మూడు దశాబ్దాలుగా సాకులు చెబుతూ ఈ బిల్లును వాయిదా వేసిన వారు కాలానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చర్చల సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తూ.. శుభకార్యాల సమయంలో దిష్టి తగలకుండా ‘కాలా టీకా’ పెట్టడం మన సంప్రదాయమని, పార్లమెంటులో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
నేను ఓబీసీనే.. కానీ ..
తన సామాజిక నేపథ్యం మరియు కుల గణనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని మోదీ లోక్‌సభ వేదికగా దీటుగా బదులిచ్చారు.
తాను వెనుకబడిన తరగతి (OBC) నుంచే వచ్చానని, అయితే దేశ ప్రధానిగా తన బాధ్యత అందరినీ కలుపుకుని పోవడమేనని ఆయన స్పష్టం చేశారు.
తనను సభకు పరిచయం చేసిన ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అఖిలేష్ యాదవ్ తనకు మిత్రుడని, అప్పుడప్పుడు ఆయన నుంచి తనకు మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.
“నేను ఓబీసీ వాడినే కావొచ్చు, కానీ నా విధి మాత్రం దేశంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం. రాజ్యాంగం నాకు నేర్పిన పాఠం ఇదే” అని మోదీ ఉద్ఘాటించారు.
మహిళా బిల్లును లేదా డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవాలని చూసే వారు భవిష్యత్తులో భారీ రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని హెచ్చరించారు.
ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో కలిసి ప్రధాని తన చాంబర్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
బిల్లును సజావుగా ఆమోదింపజేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించారు.






