Instamart HPCL On Demand LPG Delivery | క్విక్ కామర్స్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేస్తూ ప్రముఖ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ (Instamart), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా నేరుగా ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్లను బుక్ చేసుకునే సరికొత్త సేవను బుధవారం ప్రారంభించింది.
ప్రస్తుతం ఈ సేవలను కర్ణాటక రాజధాని బెంగళూరులోని సుబ్రమణ్యపుర ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్‌గా జూలై 15 నుండి అందుబాటులోకి తీసుకువచ్చారు. వినియోగదారులు తమ మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన వెంటనే గ్యాస్ సిలిండర్లను నేరుగా తమ ఇళ్లకే డెలివరీ చేయించుకోవచ్చు.
కొత్త కనెక్షన్ లేకపోయినా ఆర్డర్ చేయవచ్చు..
ఈ విధానంలో అత్యంత అనుకూలమైన విషయం ఏంటంటే, వినియోగదారులకు ముందే గృహ ఎల్‌పీజీ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టామార్ట్ యాప్‌లో తొలిసారి సిలిండర్ ఆర్డర్ చేసేటప్పుడు గుర్తింపు ధృవీకరణ (ID Verification) మరియు డెలివరీ రుజువు వంటి ప్రాథమిక లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత చేసే కొనుగోళ్లను సాధారణ రీఫిల్ ఆర్డర్లుగా పరిగణిస్తారు. డెలివరీ సమయంలో వినియోగదారులు తమ వద్ద ఉన్న ఖాళీ HPCL సిలిండర్‌ను సిబ్బందికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
కాంపాక్ట్ సైజులో సులభంగా లభించే వంట గ్యాస్ అవసరమున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, బ్యాచిలర్స్, అద్దె ఇళ్లలో ఉండేవారు మరియు చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవను రూపొందించారు.
అందుబాటులో ‘HP నవ్య’ కాంపోజిట్ సిలిండర్లు..
ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్లుగా రెండు రకాల సిలిండర్లను ఎంచుకోవచ్చు. HPCL ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టిన నూతన ‘HP నవ్య’ 10 కిలోల కాంపోజిట్ LPG సిలిండర్ లేదా కంపెనీకి చెందిన సాధారణ 5 కిలోల మెటల్ సిలిండర్లను ఆర్డర్ చేసుకునే వీలుంది.
ఈ ప్రారంభోత్సవంతో పాటు ‘HP నవ్య’ 10-కేజీల కాంపోజిట్ సిలిండర్ల వాణిజ్య విక్రయాలు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ స్టీల్ సిలిండర్లతో పోలిస్తే ఇది చాలా తేలికగా ఉంటుంది, తుప్పు పట్టదు.
అంతేకాకుండా, దీని బాడీ పారదర్శకంగా (Transparent) ఉండటం వల్ల సిలిండర్‌లో ఇంకా ఎంత గ్యాస్ మిగిలి ఉందో వినియోగదారులు బయటి నుంచే సులభంగా చూసి తెలుసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి, చిన్న కుటుంబాలకు మరియు అదనంగా రెండో సిలిండర్ (సెకండ్ సిలిండర్) ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమ ఆప్షన్ అని HPCL తెలిపింది.
భద్రతా ప్రమాణాలతో పంపిణీ..
యాప్ ద్వారా బుక్ చేసినప్పటికీ, ప్రతి ఆర్డర్‌ను HPCL యొక్క అధికారిక, అధీకృత పంపిణీదారుల (Distributors) నెట్‌వర్క్ ద్వారా మాత్రమే డెలివరీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ద్వారానే ఈ డెలివరీలు నిర్వహించబడతాయి.
“ఇన్‌స్టామార్ట్ కేవలం కిరాణా వస్తువులకే పరిమితం కాకుండా నిత్యావసర గృహ సేవల విభాగంలోకి విస్తరిస్తోంది. HPCL భాగస్వామ్యంతో వినియోగదారులు కోరుకునే అత్యున్నత భద్రత, విశ్వసనీయత ప్రమాణాలతో వంట గ్యాస్‌ను వారి ఇంటి గుమ్మం వద్దకే చేర్చుతున్నాం.” — అమితేష్ ఝా, ఇన్‌స్టామార్ట్ సీఈఓ
హెచ్‌పిసిఎల్ డైరెక్టర్ (మార్కెటింగ్) అమిత్ గార్గ్ మాట్లాడుతూ.. డిజిటల్ మాధ్యమాల ద్వారా మారుతున్న వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా మారడానికి ఈ వినూత్న భాగస్వామ్యం తోడ్పడుతుందని అన్నారు.
వేగవంతమైన, డిజిటల్ ఆధారిత వేదిక ద్వారా ‘నయా భారత్’కు ఎల్‌పీజీని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.







