65-km traffic jam in Bihar | బీహార్ రాష్ట్రం రోహతాస్ జిల్లాలోని ఢిల్లీ-కోల్కత్త జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత శుక్రవారం నుంచి వాహనాలు ఇదే హైవే పై స్తంభించిపోయాయి. సుమారు 65 కి.మీ. ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్క కి.మీ. ప్రయాణించడానికే గంటల సమయం పడుతుంది.
24 గంటల్లో కేవలం 5 కి.మీ. మాత్రమే ముందుకు సాగినట్లు ఓ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. దింతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నవారు ఆహారం, నీళ్ల కోసం ఇక్కట్లు పడుతున్నారు. గత శుక్రవారం నుంచి రోహతస్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా NH-19 మీదున్న సర్వీస్ లేన్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది.
అలాగే రహదారి విస్తరణ పనుల కారణంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గాలు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. ఆహారం కూడా సరిగ్గా లేకపోవడంతో రోడ్డు పక్కన షాపుల్లో టీ, బిస్కెట్లు తింటూ తమ వాహనాలతో ముందుకు వెళ్తున్నట్లు పలువురు డ్రైవర్లు చెబుతున్నారు. మరోవైపు అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో వారు విఫలం అయ్యారని మండిపడుతున్నారు.









