Actress Manjari Fadnis | మూగజీవాల పట్ల మనుషుల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న క్రూరత్వానికి అద్దం పట్టే ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
తన ప్రాణ సమానమైన పెంపుడు శునకాన్ని కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరంగా కొట్టి చంపారని తెలియజేస్తూ ప్రముఖ బాలీవుడ్ నటి మంజరి ఫడ్నీస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఈ విషాదాన్ని వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి, నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.
నటి మంజరి ఫడ్నీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘మైకీ’ అనే పేరుగల ఒక శునకం 2019వ సంవత్సరం నుండి వారు నివసిస్తున్న కమ్యూనిటీ సొసైటీలోనే ఉంటోంది. అది చాలా సాధు జంతువని, సొసైటీలో అందరితో ఎంతో ప్రేమగా ఉండేదని ఆమె పేర్కొన్నారు.
అయితే, తాజాగా ఆ శునకం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దాంతో కంగారుపడిన నటి, ఆమె కుటుంబ సభ్యులు మైకీ ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో ఎంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం దక్కలేదు.
మైకీ కోసం వెతుకుతున్న క్రమంలోనే వారికి ఊహించని షాకింగ్ నిజం తెలిసింది. తాము నివసిస్తున్న కమ్యూనిటీ సొసైటీకి చెందిన మరో వ్యక్తే ఆ శునకాన్ని అత్యంత అమానుషంగా కొట్టి చంపినట్లు స్వయంగా ఒప్పుకున్నాడని నటి మంజరి వెల్లడించారు.
సదరు వ్యక్తి మైకీని కర్రలతో దారుణంగా బాది హత్య చేశాడని.. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ తెలియకుండా ఒక బస్తాలో కుక్కి, నిర్మానుష్యమైన ఖాళీ స్థలంలో పారేశాడని చెబుతూ ఆమె లైవ్‌లోనే బోరున విలపించారు.
తన పెంపుడు శునకానికి జరిగిన అన్యాయంపై నటి మంజరి ఫడ్నీస్ చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసి, కఠిన చర్యలు తీసుకునేలా ప్రక్రియ ప్రారంభించామని స్పష్టం చేశారు.
మూగజీవాన్ని అంత క్రూరంగా అంతమొందించిన ఆ క్రిమినల్స్‌ను చట్టం ముందు నిలబెట్టి తీరుతామని, వారికి కఠిన శిక్ష పడేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో చూసిన పలువురు సినీ ప్రముఖులు, జంతు ప్రేమికులు మంజరి ఫడ్నీస్‌కు మద్దతుగా నిలుస్తూ.. నిందితులపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.







