Wednesday 17th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ బాటలోనే బండ్ల గణేష్.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం!

పవన్ బాటలోనే బండ్ల గణేష్.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం!

Bandla Ganesh Helps Pawan Kalyan Fan | సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ స్పూర్తితో, హనుమకొండకు చెందిన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ వీరాభిమాని నిరంజన్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ హనుమకొండ పర్యటన..

హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ తీవ్రమైన అనారోగ్య సమస్యతో పోరాడుతున్నాడు. తన జీవితంలో చివరి కోరికగా పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఆకాంక్షిస్తూ నిరంజన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్, బుధవారం (జూన్ 17, 2026) ఉదయం నేరుగా హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లారు. అతడిని పరామర్శించి, మాట్లాడి ఆఖరి కోరికను నెరవేర్చారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు.

కదిలించిన పవన్ – నిరంజన్ కలయిక.. బండ్ల గణేష్ ట్వీట్..

పవన్ కళ్యాణ్, నిరంజన్‌ల కలయికకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ తరుణంలో ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఆర్థిక సాయం ప్రకటన చేశారు.

“చాలా కాలంగా మా ‘దేవుడు’ పవన్ కళ్యాణ్ గారిని కలవాలనే నిరంజన్ కోరిక నెరవేరడం నా హృదయాన్ని తీవ్రంగా కదిలించింది.

పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా, ఆయన ఇచ్చిన స్పూర్తితో నా ‘పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్’ తరఫున నిరంజన్ వైద్య ఖర్చులు, అతడి కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం.” అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ చూపిన మానవత్వపు బాటలోనే నడుస్తూ, బండ్ల గణేష్ కూడా తక్షణమే స్పందించి నిరంజన్ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించడం పట్ల ఇరు రంగాల ప్రముఖులు, పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
అభిమాని కోసం హనుమకొండకు పవన్ కళ్యాణ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions