Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాకిస్థాన్ నావికాదళ నౌక!

భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాకిస్థాన్ నావికాదళ నౌక!

Pakistan Naval Ship Collides With Indian Navy Warship అంతర్జాతీయ జలాల్లో పాకిస్థాన్ నావికాదళం అత్యంత ప్రమాదకర రీతిలో వ్యవహరించింది. ఉత్తర అరబీ సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత యుద్ధనౌకను పాకిస్థాన్‌కు చెందిన ‘PNS హునైన్’ (PNS Hunain) అనే పెట్రోలింగ్ నౌక వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ఘటనలో భారత యుద్ధనౌకకు గానీ, నావికాదళ సిబ్బందికి గానీ ఎలాంటి నష్టం లేదా గాయాలు కానప్పటికీ, పాకిస్థాన్ చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో న్యూఢిల్లీలోని పాకిస్థాన్ అగ్ర దౌత్యవేత్త (Charge d’Affaires)ను విదేశాంగ శాఖ (MEA) కార్యాలయానికి పిలిపించి సమన్లు జారీ చేయడంతో పాటు తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది.

ఇటీవల కాలంలో దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ అరబీ సముద్రంలో ఆరు నెలల వ్యవధిలోనే పాకిస్థాన్ నావికాదళం ఇలాంటి ప్రమాదకర విన్యాసాలకు పాల్పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం.

హెచ్చరికలు పట్టించుకోకుండా దాడి తరహాలో…

సెప్టెంబర్ 15 సాయంత్రం భారత యుద్ధనౌక రొటీన్ నిఘాలో ఉండగా పాక్ నౌక ‘PNS హునైన్’ ఫాలో అయింది. రేడియో ఛానల్ 16 ద్వారా భారత బలగాలు పదేపదే హెచ్చరించినప్పటికీ, పాక్ నౌక ఉన్నట్టుండి వేగాన్ని పెంచి భారత యుద్ధనౌక ముందు భాగాన్ని కట్ చేస్తూ వెళ్లేందుకు ప్రయత్నించి ఢీకొట్టింది.

ఘటనలో భారత యుద్ధనౌక నిర్మాణాత్మక సామర్థ్యానికి (Structural damage) ఎలాంటి నష్టం వాటిల్లలేదు. నావికాదళ సిబ్బంది సురక్షితంగా ఉండటంతో భారత నౌక తన నిఘా సేవలను యథావిధిగా కొనసాగించింది.

1991 ద్వైపాక్షిక ఒప్పందం ఉల్లంఘన..

అంతర్జాతీయ జలాల్లో రెండు దేశాల సైనిక నౌకలు లేదా జలఅంతర్గాములు పరస్పరం కనీసం 3 నాటికల్ మైళ్ల (దాదాపు 5.6 కిమీ) దూరం పాటించాలని 1991 ఆర్టికల్ 10 ఒప్పందం పేర్కొంటోంది. పాక్ నౌక ఈ నిబంధనను ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని భారత్ స్పష్టం చేసింది.

పాకిస్థాన్ విదేశాంగ శాఖ వద్ద ఈ విషయాన్ని అత్యవసరంగా లేవనెత్తాలని ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి (Charge d’Affaires) కూడా విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

2011 నాటి ఘటనల పునరావృతం..

గతంలో 2011లో గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అప్పట్లో పాకిస్థాన్ యుద్ధనౌక ‘PNS బాబర్’ తీవ్ర వేగంతో వచ్చి భారత యుద్ధనౌక ‘INS గోదావరి’ హెలికాప్టర్ ఫ్లైట్ డెక్ నెట్‌ను ఢీకొట్టి దెబ్బతీసింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పాక్ వైఖరిపై ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వర్గాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions