- క్రమశిక్షణ కమిటీకి కేటాయింపు, నోటీసులు జారీకి సిద్ధం!
TPCC Chief Mahesh Kumar Goud Serious On MLA Anirudh Reddy సొంత పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ మొత్తం వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే అనిరుధ్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. “జడ్చర్లలో నేను చస్తేనే నిధులు, బిల్లులు వస్తాయంటే… నియోజకవర్గ అభివృద్ధి కోసం చనిపోవడానికైనా సిద్ధం” అని అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నిధుల విడుదలను ప్రశ్నిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. “నిధుల కొరత అనేది కేవలం ఒక్క జడ్చర్ల నియోజకవర్గానికే పరిమితం కాదు, రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలా బహిరంగంగా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదు” అని హితవు పలికారు. క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఢిల్లీ ర్యాలీకి రైళ్ల నిరాకరణ..
నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న కాంగ్రెస్ బారీ ర్యాలీకి తెలంగాణ నుంచి కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక రైళ్ల (Special Trains) కోసం దరఖాస్తు చేసుకోగా, దక్షిణ మధ్య రైల్వే సాకులు చెబుతూ తిరస్కరిస్తోందని మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రాహుల్ గాంధీ పేరు చెబితేనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వణికిపోతోంది.” రైల్వే శాఖ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తెలంగాణ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను ఢిల్లీ ర్యాలీకి తీసుకెళ్లి తీరుతాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.











