Saturday 11th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘భారత నగరాల పేర్లు, కివీస్ జట్టులో దేశీ ప్రతిభ’.. ప్రధాని మోదీ!

‘భారత నగరాల పేర్లు, కివీస్ జట్టులో దేశీ ప్రతిభ’.. ప్రధాని మోదీ!

M Modi Visit To New Zealand | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా శనివారం (జూలై 11, 2026) ఆక్లాండ్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల (Indian Diaspora) ఘనస్వాగత సభలో ప్రసంగించారు.

రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.న్యూజిలాండ్ ప్రగతిలో భారత సంతతికి చెందిన వారు పోషిస్తున్న పాత్రను, వారి సేవా నిరతిని ప్రధాని ముక్తకంఠంతో కొనియాడారు.

కివీస్ గడ్డపై భారత నగరాల పేర్లు.. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న గాఢమైన చారిత్రక అనుబంధాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూజిలాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారతీయ నగరాలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఉన్న వీధుల పేర్లను ఆయన ఉదహరించారు.

న్యూజిలాండ్ రోడ్లపై భారత నగరాలకు గౌరవం దక్కిందని చెబుతూ.. అక్కడ ఖండాలా, బొంబాయి హిల్స్, కోరమండల్, కలకత్తా స్ట్రీట్, ఢిల్లీ క్రెసెంట్ మరియు అమృత్‌సర్ స్ట్రీట్ వంటి అనేక ప్రదేశాలకు భారతీయ పేర్లు ఉండటం ఇరు దేశాల శాశ్వత బంధానికి సజీవ సాక్ష్యాలని ప్రధాని పేర్కొన్నారు.

భారత సంతతి విజేతలపై ప్రశంసలు..

న్యూజిలాండ్‌లో ప్రతిభావంతులకు లభించే అవకాశాలను, అక్కడ అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్న భారత సంతతి ప్రముఖులను ప్రధాని అభినందించారు.

“ఆనంద్ సత్యానంద్ గారు ఇక్కడి గవర్నర్ జనరల్ కాగల ప్రదేశం ఇది. నిఖిల్ రవిశంకర్ లాంటి వ్యక్తి ఎయిర్ న్యూజిలాండ్ సీఈఓ అయ్యే అవకాశం కల్పించిన దేశం ఇది.

అంతేకాకుండా, న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టులో రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, అజాజ్ పటేల్ వంటి అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఇలాంటి ఎందరో విజేతలను న్యూజిలాండ్ తీర్చిదిద్దుతోంది.” అని మోదీ వ్యాఖ్యానించారు.

భారత ప్రవాసులు తమ మూలాలను మరువకుండానే, ఇక్కడ “పూర్తిస్థాయి కివీలుగా (Full Kiwis)” మారి దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నారని కొనియాడారు.

“నేను ఎప్పుడు న్యూజిలాండ్ నాయకులను కలిసినా.. వారు ఇక్కడి భారతీయ సమాజం గురించి ఎంతో గొప్పగా చెబుతారు. ఆ ప్రశంసల గౌరవం మీకే దక్కుతుంది, కానీ ఒక భారతీయుడిగా నా తల గర్వంతో ఉప్పొంగుతుంది” అని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.

30 ఏళ్ల నాటి మఫ్లర్ జ్ఞాపకం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టడానికి, ప్రభుత్వంలోకి రావడానికి చాలా కాలం క్రితం.. అంటే దాదాపు 25 నుండి 30 సంవత్సరాల క్రితం సాధారణ పౌరుడిగా న్యూజిలాండ్‌కు వచ్చిన మొదటి పర్యటనను గుర్తుచేసుకున్నారు.

“ఆనాటి పర్యటనలో ఒక స్థానిక న్యూజిలాండర్ (కివీ) నాకు ఎంతో ఆప్యాయంగా ఒక మఫ్లర్, టోపీ, ఒక జత చేతి తొడుగులను బహుమతిగా ఇచ్చారు.

ఆ అమూల్యమైన జ్ఞాపకాలలో ఆ మఫ్లర్‌ను నేను ఇప్పటికీ నా దగ్గరే భద్రంగా ఉంచుకున్నాను. అది న్యూజిలాండ్ ప్రజలు నాపై చూపిన అపారమైన ఆప్యాయతకు, అభిమానానికి నిదర్శనం.” అని మోదీ గుర్తు చేసుకున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions