- తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలనం!
Kavitha Comments On BRS Funds | తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.
సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ (BRS) పార్టీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ బ్యాంక్ ఖాతాలపై షాకింగ్ విషయాలను వెల్లడించారు.
బీఆర్‌ఎస్ పార్టీ బ్యాంక్ ఖాతాలో ప్రస్తుతం రూ. 1,400 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని, ఆ సొమ్మంతా ‘క్విడ్ ప్రో కో’ (Quid Pro Quo) పద్ధతిలో ఆంధ్రా కాంట్రాక్టర్ల నుండి వచ్చిన అక్రమ సంపాదనేనని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
‘అమరవీరుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పంచాలి’
ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టగా వచ్చిన ఈ రూ. 1,400 కోట్ల అక్రమ సొమ్మును బీఆర్‌ఎస్ పార్టీ తన ఖాతాలో దాచుకుందని కవిత మండిపడ్డారు.
“బీఆర్‌ఎస్ అకౌంట్లో ఉన్న రూ. 1,400 కోట్ల నిధులను వెంటనే తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు పంచాలి. ప్రతి అమరవీరుడి కుటుంబానికి రూ. 1 కోటి చొప్పున ఈ నిధుల నుండి పరిహారం అందించాలి.” కవిత డిమాండ్ చేశారు.
Read Also: ‘సనాతన ధర్మంపై దాడి చేస్తే ఉరిశిక్ష వేయాలి’
‘కాళేశ్వరం అవినీతి సూత్రధారి హరీశ్ రావే’..
బీఆర్‌ఎస్ అగ్రనేతలపై కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి మాజీ మంత్రి హరీశ్ రావే ప్రధాన కారకుడని ఆమె ఆరోపించారు. అవినీతి ఊబిలో పూర్తిగా కూరుకుపోయిన బీఆర్‌ఎస్ పార్టీ.. జన్మలో మళ్లీ తెలంగాణలో అధికారంలోకి రాలేదని ఆమె జోస్యం చెప్పారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లకు కేటాయించిన భూములను తాము క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు కవిత వెల్లడించారు.
తెలంగాణ ఆస్తులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని సహించేది లేదని, ఆ భూములన్నింటినీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
‘బీఆర్‌ఎస్ అభద్రతాభావానికి నిదర్శనం’..
తెలంగాణ రక్షణ సేన పేరిట తాము కొత్తగా పార్టీ పెట్టుకుని, ప్రజా సమస్యలపై తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతుంటే.. బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని కవిత ఎద్దేవా చేశారు.
తమ పార్టీ వల్ల ఎలాంటి భయం లేదని పైకి గంభీరంగా ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్‌ఎస్ నేతలే.. లోపల భయపడుతూ ఎన్నికల సంఘానికి (ECI) తమపై వెయ్యికి పైగా ఫిర్యాదులు చేశారని దుయ్యబట్టారు.
ఈ ఫిర్యాదుల పర్వమే బీఆర్‌ఎస్ నాయకుల్లో ఉన్న అభద్రతాభావాన్ని, ఓటమి భయాన్ని స్పష్టంగా బయటపెడుతోందని ఆమె ధ్వజమెత్తుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.








