Thursday 13th August 2026
12:07:03 PM
Home > తాజా > “కొడంగల్‌లో 11 వేల కర్ణాటక ఓట్లు”.. కవిత సంచలన ఆరోపణలు!

“కొడంగల్‌లో 11 వేల కర్ణాటక ఓట్లు”.. కవిత సంచలన ఆరోపణలు!

Karnataka Voters in Kodangal | తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాపై ‘తెలంగాణ రక్షణ సేన’ అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

కర్ణాటక నుండి ఓట్ల బదిలీ..

హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కవిత ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలను బయటపెట్టారు. కర్ణాటకలోని సెడం నియోజకవర్గానికి చెందిన దాదాపు 11,000 మంది ఓటర్లు కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తంగా 22,000 డూప్లికేట్ (నకిలీ) ఓట్లు ఉన్నాయని, అందులో 11,000 ఓట్లు కర్ణాటకకు చెందినవేనని స్పష్టం చేశారు.

ఈసీ సీఎంకు ఫేవర్ చేసిందా..

గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన మెజారిటీ మార్జిన్ కూడా సరిగ్గా ఇదే స్థాయిలో ఉందని గుర్తుచేసిన కవిత, రేవంత్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల సంఘం (EC) ఏమైనా ఫేవర్ చేసిందా? అని బహిరంగంగా అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి తెలంగాణకు కేవలం ఎన్నికల నిధుల (డబ్బులు) బదిలీ మాత్రమే కాకుండా, ఓట్లను కూడా బదిలీ చేశారా? అని ఆమె ప్రశ్నించారు.

బోధన్ వర్సెస్ కొడంగల్.. ‘ఎస్ఐఆర్’ పై అనుమానాలు..

ఓట్ల తొలగింపు ప్రక్రియలో ఎన్నికల అధికారులు ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని కవిత విమర్శించారు.  గత ఏడాదిన్నర కాలంలో బోధన్ నియోజకవర్గంలో దాదాపు 7,000 నకిలీ ఓట్లను తొలగించిన అధికారులు.. సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌లో మాత్రం కేవలం 800 ఓట్లను మాత్రమే ఎందుకు తొలగించారని నిలదీశారు.

ఈసీ స్పష్టత ఇవ్వాలి..

ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని, ఈ అక్రమాలన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి ఓటర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితమైన సంస్కరణలు రావాలని కవిత అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్తంగా “వన్ నేషన్, వన్ ఎలక్షన్” (ఒకే దేశం, ఒకే ఎన్నిక) విధానంతో పాటు, ప్రతి పౌరుడికి దేశంలో ఒకే ఒక ఓటు ఉండేలా “వన్ ఓటు” (One Vote) విధానాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె స్పష్టం చేశారు.

You may also like
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
ADR Report: సీఎంల ఆస్తులు, కేసులు.. రేవంత్ టాప్, డీకే నంబర్-1

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions