Kajal Kangana Supports Deepika | సినీ పరిశ్రమలో తల్లులైన నటీమణుల పని గంటలపై (Working Hours) ప్రస్తుతం బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
తల్లి అయిన తర్వాత తన బిడ్డ కోసం షూటింగ్‌లలో రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని, అంతకంటే ఎక్కువ సమయం కేటాయించలేనని బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకోన్ (Deepika Padukone) పెట్టిన నిబంధన పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), అలాగే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) లు దీపికా పడుకోన్ డిమాండ్‌కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు.
కాజల్ అగర్వాల్ పెళ్లై, ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత తన కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటున్న నటి కాజల్ అగర్వాల్ జూమ్ (Zoom) ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీపికను పూర్తిగా సమర్థించారు.
“నా కొత్త సినిమాల కాంట్రాక్టులలో కూడా నా పని గంటలను ఇప్పుడు చాలా స్పష్టంగా పేర్కొంటున్నాను. ఆదివారాలు అసలు పని చేయనని రాసి ఉంది. ఆ సమయాన్ని పూర్తిగా నా బిడ్డకే కేటాయిస్తాను. గతంలోలాగా ఇప్పుడు నేను విరామం లేకుండా నిరంతరం పని చేయలేను” అని కాజల్ స్పష్టం చేశారు.
సినిమా రంగానికి మినహాయింపు ఎందుకు?
ఇదంతా జీవితంలో మనం ఇచ్చుకునే ప్రాధాన్యతల (Priorities) గురించేనని ఆమె అన్నారు. “కార్పొరేట్ ప్రపంచంలో మరియు అన్ని రంగాలలో మహిళా ఉద్యోగులకు నిర్ణీత పని గంటలు, సెలవులు ఉంటాయి.
మరి అలాంటప్పుడు సినీ పరిశ్రమలో కూడా ఎందుకు ఉండకూడదు? ఎంతో కష్టపడి ఒక స్థాయికి చేరిన తర్వాత, ఇలాంటి ఒక చిన్న అభ్యర్థన చేసే హక్కు మహిళలకు ఉంటుంది. అది అడగడానికి మరీ ఎక్కువ ఏమీ కాదు” అని కాజల్ నొక్కి చెప్పారు.
అగ్ర నటిగా ఆమె దానికి అర్హురాలు..
కంగనా రనౌత్ గతంలో ఆమిర్ ఖాన్ నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ షో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కంగనా రనౌత్ కూడా దీపికా పడుకోన్ డిమాండ్‌ను గట్టిగా సమర్థించారు. “మేము పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో సక్సెస్ కోసం రోజుకు 12 నుండి 14 గంటలు కూడా అలసట లేకుండా పనిచేశాం.
కొత్తగా వచ్చినప్పుడు మన స్థానంలో ఎవరినైనా మార్చవచ్చు కాబట్టి అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ ఈ రోజు దీపికా పడుకోన్ ఒక తల్లిగా, ఒక కుటుంబాన్ని కలిగి ఉండి.. ‘ఆమె మాత్రమే మాకు కావాలి’ అని మేకర్స్ అనుకునే అంతటి అగ్రశ్రేణి స్థాయిని సంపాదించుకుంది.
ఆమె కేవలం ఎనిమిది గంటలే పని చేయాలనుకుంటే, ఆమె దానికి పూర్తి అర్హురాలు. నిర్మాతలు ఆమె షెడ్యూల్‌కు అనుగుణంగా సర్దుకుపోవాల్సిందే.” అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
సినిమాల నుండి తప్పుకుంటున్న దీపిక?
రణవీర్ సింగ్‌తో కలిసి సెప్టెంబర్ 2024 లో కుమార్తె ‘దువా పడుకోన్ సింగ్’ (Dua Padukone Singh) కు జన్మనిచ్చిన దీపిక, ప్రస్తుతం తన రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. తన బిడ్డల సంరక్షణ కోసమే ఆమె ఎనిమిది గంటల షిఫ్ట్ నిబంధనను పెట్టినట్లు సమాచారం.
అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్ర నిర్మాతలు ఈ 8 గంటల షరతుకు ఒప్పుకోలేకపోవడంతో.. దీపిక ఆ ప్రాజెక్ట్ నుండి, అలాగే ‘కల్కి 2898 AD’ సీక్వెల్ (Kalki Sequel) నుండి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.







