MP Dharmapuri Arvind Satires On KTR Beard గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అయిపోవచ్చని ఎవరో చెప్పడంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలా చేస్తున్నారేమోనంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గతంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా సీఎం కావాలనే ఆశతో గడ్డం పెంచారని, కానీ ఆయన గడ్డం పెరిగిందే తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని గుర్తుచేశారు. కేటీఆర్ గడ్డం ఎంత పెరిగినా ఆయన మాత్రం ముఖ్యమంత్రి కాలేరంటూ ఎంపీ అర్వింద్ సెటైర్లు వేశారు.
నిజామాబాద్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు.
సీఎం కావాలనే ఆశతోనేనా?
కేసీఆర్ గతంలో పాత సచివాలయానికి వెళ్తే ఓడిపోతారని కొత్త సెక్రటేరియట్ కట్టినా అధికారం కోల్పోయారని, ఇప్పుడు కేటీఆర్ గడ్డం పెంచితే సీఎం అవుతారన్న మూఢనమ్మకంతో అలా తిరుగుతున్నారని అర్వింద్ ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉదాహరణే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
కాషాయ సునామీ ఖాయం..
తెలంగాణలో బీజేపీ మౌనంగా ఉందన్న ప్రచారాన్ని అర్వింద్ తోసిపుచ్చారు. వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే కాషాయ సునామీ సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెరవెనుక పార్టీ బలోపేతానికి ముమ్మర కసరత్తు జరుగుతోందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ – బీఆర్ఎస్ రహస్య పొత్తు..
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం రక్షించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తితో ఉందని, బీఆర్ఎస్తో పొత్తు ద్వారా ఆయనను పదవి నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి అడ్డాగా మారిందని, లక్షల కోట్లు దోచుకున్న ఆ పార్టీకి ప్రజలు మళ్లీ ఓటేసే ప్రసక్తే లేదని అర్వింద్ తేల్చిచెప్పారు. త్వరలోనే బీజేపీ సోషల్ మీడియా మరియు ఇతర వేదికల ద్వారా మరింత దూకుడు పెంచుతుందని హెచ్చరించారు.











