- తమిళనాడు సీఎస్, డీజీపీ సహా 15 మందికి కోర్టు ధిక్కరణ నోటీసులు..
- కొండ భద్రత సీఆర్పీఎఫ్కు అప్పగింత!
Deepathoon Contempt Notices మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ (Deepathoon) వద్ద కార్తీక దీపం వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం (నవంబర్ 27) అత్యంత కీలకమైన, సంచలన ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న ఆరోపణలపై వివరణ కోరుతూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ (DGP) సహా మొత్తం 15 మంది అధికారులకు అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు (Contempt Notices) జారీ చేసింది.
15 మంది ఉన్నతాధికారులకు నోటీసులు..
సీఎస్, డీజీపీలతో పాటు దేవాదాయ శాఖ (HR&CE) కార్యదర్శి, కమిషనర్, మధురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎస్పీ, ఆలయ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంబంధిత అధికారులందరికీ మూడు రోజుల్లోగా వ్యక్తిగతంగా నోటీసులు అందేలా చూడాలని సీఎస్‌ను ఆదేశించిన కోర్టు, ఆ మేరకు వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
ట్రస్ట్ బోర్డు సస్పెన్షన్..
తిరుప్పరంకుండ్రం ఆలయ ధర్మకర్తల మండలిని (Board of Trustees) సుప్రీంకోర్టు తక్షణమే సస్పెండ్ చేసింది. ఆలయ ట్రస్ట్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు రిసీవర్లుగా రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్‌లను నియమించింది.
సీఆర్పీఎఫ్ (CRPF) చేతికి కొండ భద్రత..
తన గత ఆదేశాలను అమలు చేయడంలో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ, ఆలయం మరియు మొత్తం తిరుప్పరంకుండ్రం కొండ భద్రతను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు సుప్రీంకోర్టు అప్పగించింది. కొండపై ఉన్న ఆలయం, దర్గా రెండూ ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని, భక్తులు తమ సంప్రదాయ మతపరమైన ఆచారాలను నిర్వహించుకునేందుకు అనుమతించాలని సీఆర్పీఎఫ్ను ఆదేశించింది.







