- కాంగ్రెస్‌ను మూలాలతో సహా పెకిలిస్తాం.
- ఢిల్లీ ర్యాలీపై అమిత్ షా తీవ్ర విమర్శలు, రాహుల్‌కు సవాల్!
Amit Shah Speech In Hyderabad కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజు మెడలు వంచడం వల్లే నేడు హైదరాబాద్ భారతదేశంలో భాగమైందని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించిన ర్యాలీ ‘ఓటు బచావో’ ర్యాలీ కాదని, అది కేవలం ‘చొరబాటుదారుల బచావో’ ర్యాలీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా మార్చుకుందని, అందుకే సమగ్ర ఓటర్ల పరిశీలన (SIR) ప్రక్రియను నిలిపివేయాలని చూస్తోందని ఆరోపించారు.
ఓట్ల తొలగింపుపై రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్..
13 కోట్ల ఓట్లను తొలగించారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను హోంమంత్రి తీవ్రంగా ఖండించారు. తొలగించిన ఓట్లలో 4.25 కోట్ల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, వారికి రెండు ఓట్లు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. 3 కోట్ల మంది చనిపోయిన వారి ఓట్లను తొలగించామని, ఆ ఓట్లను అలాగే ఉంచి కాంగ్రెస్ కార్యకర్తలు వేయాలని చూస్తున్నారా అని నిలదీశారు. కోటి డూప్లికేట్ ఓట్లతో పాటు, అసలు ఉనికిలోనే లేని మరో 3 కోట్ల ఓట్లను తొలగించినట్లు స్పష్టం చేశారు.
SIR ప్రక్రియ వల్లే బీజేపీ గెలుస్తోందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 2014, 2019లలో ఈ ప్రక్రియ లేకుండానే మోదీ విజయం సాధించారని, పశ్చిమ బెంగాల్, అస్సాం, బిహార్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ప్రజల మద్దతుతోనే బీజేపీ గెలిచిందని షా స్పష్టం చేశారు.
నకిలీ పార్లమెంటు.. ఈవీఎంలపై ద్వంద్వ నీతి..
కాంగ్రెస్ నిర్వహించిన మాక్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడుతు నకిలీ పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉండటానికి బదులు ప్రధానిగా వ్యవహరిస్తే సోనియా గాంధీ మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగే రాహుల్ దానికి కనీస గౌరవం కూడా ఇవ్వరని విమర్శించారు. ఈవీఎంలు, SIR, చొరబాటుదారుల అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రాహుల్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
అలాగే, బీజేపీ గెలిస్తే ఈవీఎంలను నిందించే కాంగ్రెస్.. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళ, తమిళనాడులలో వారి కూటమి ఎలా గెలిచాయని ప్రశ్నించారు. “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్లుగా రాహుల్ వ్యవహారం ఉందన్నారు.
తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం..
కేంద్రంలో 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగితే, మోదీ 12 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా చెప్పారు. తెలంగాణను రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏటీఎంగా మార్చారని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదని మండిపడ్డారు.
ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, ముమ్మారు తలాక్ రద్దు, ఉగ్రవాదం మరియు నక్సలిజం రూపుమాపడం మోదీ హామీ ఇచ్చి నెరవేర్చారని గుర్తుచేశారు. తెలంగాణను కాపాడే శక్తి కేవలం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కార్యకర్తలంతా కలిసి తెలంగాణలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.











