Thursday 30th July 2026
12:07:03 PM
Home > తాజా > నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 7,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 7,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

acb telangana

Telangana Police Recruitment 2026 | తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) బుధవారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.

పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు.

పోలీస్ శాఖలోనే అత్యధిక ఖాళీలు..

తాజా నోటిఫికేషన్ ప్రకారం పోలీస్ శాఖలోనే అత్యధికంగా పోస్టులు ఉన్నాయి. వీటిలో 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్, 148 సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్, 14 రిజర్వ్ ఎస్సై (AR), 12 రిజర్వ్ ఎస్సై (TGSP), 3 రిజర్వ్ ఎస్సై (SARCPL), 23 అసిస్టెంట్ ఎస్సై (FPB), 24 కానిస్టేబుల్ (SARCPL), 20 కానిస్టేబుల్ డ్రైవర్ (PTO), 7 కానిస్టేబుల్ మెకానిక్ (PTO) పోస్టులు ఉన్నాయి.

SPF, ఫైర్, జైళ్ల శాఖల్లోనూ భారీ నియామకాలు

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లో 1,380 కానిస్టేబుల్, 44 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ విభాగంలో 751 ఫైర్ ఫైటర్, 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో 14 డిప్యూటీ జైలర్ (పురుషులు), ఒక డిప్యూటీ జైలర్ (మహిళ), 196 వార్డర్ (పురుషులు), 12 వార్డర్ (మహిళ) పోస్టులను భర్తీ చేయనున్నారు.

త్వరలో దరఖాస్తుల షెడ్యూల్

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgprb.inలో నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

అభ్యర్థులకు ముఖ్య సూచన

దరఖాస్తు చేసుకునే ముందు సివిల్ సర్జన్‌తో వైద్య పరీక్షలు చేయించుకుని, నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు సూచించారు. దీంతో తదుపరి దశల్లో అనర్హత కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions