PM Modi Gifts Thirukkural To Putin న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) సమ్మిట్ ద్వైపాక్షిక భేటీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రాచీన తమిళ ప్రసిద్ధ గ్రంథం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహుమతిగా అందించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరియు చారిత్రక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రధాని ఈ విశిష్ట కానుకను ఇచ్చారు.
రష్యన్ అనువాద ప్రతి..
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళం 2026లో ప్రచురించిన ఈ పుస్తకంలో మూల తమిళ పద్యాలు, వాటి ఉచ్ఛారణ మరియు నైరా మ్కర్ట్‌చ్యాన్ చేసిన రష్యన్ అనువాదం ఉన్నాయి. 19వ శతాబ్దంలోనే ప్రముఖ రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ ‘తిరుక్కురళ్’ గ్రంథం ద్వారా ప్రభావితమయ్యారని, ఆయన ఆలోచనలే తర్వాత మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతానికి పునాదిగా నిలిచాయని పేర్కొంటారు.
కవి-తత్వవేత్త తిరువళ్లువర్ రాసిన ‘తిరుక్కురళ్’లో 133 అధ్యాయాల్లో మొత్తం 1,330 పద్యాలు (కురళ్లు) ఉన్నాయి ఈ గ్రంథం అరమ్ (ధర్మం), పొరుళ్ (అర్థం/పాలన), ఇంబమ్ (కామం/ప్రేమ) అనే మూడు భాగాలుగా విభజించబడింది.
ప్రధాని మోదీ గతంలో కూడా ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూగినియా, థాయిలాండ్ మరియు జపాన్ దేశాల నాయకులకు ‘తిరుక్కురళ్’ విభిన్న భాషల అనువాద ప్రతులను బహుకరించారు.








