- శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి!
Free Accident Insurance రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఒక్క రూపాయి ప్రీమియం లేదా భారం లేకుండా రూ. కోటి వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమగ్రంగా సమాధానమిస్తూ, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 12.91 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
ఉచిత ప్రమాద బీమా పథకం (జీవో 77)…
ఖజానాపై లేదా ఉద్యోగుల వేతనాలపై ఎలాంటి భారం పడకుండా, 16 ప్రముఖ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని ఆర్థిక శాఖ జీవో 77 జారీ చేసింది. 5.18 లక్షల మంది రెగ్యులర్ సిబ్బంది, 5.00 లక్షల మంది కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్/తాత్కాలిక సిబ్బంది మరియు 2.72 లక్షల మంది పెన్షనర్లకు ఈ బీమా వర్తిస్తుంది.
89 కుటుంబాలకు బీమా పరిహారం..
ఈ పథకం ద్వారా ఇప్పటికే 89 ఉద్యోగ కుటుంబాలకు పరిహారం అందించారు. ఇందులో సింగరేణిలో 50, విద్యుత్ శాఖలో 15, ఇతర ప్రభుత్వ శాఖల్లో 24 మంది ఉన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యంతో పాటు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 2.20 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు బీమా లభిస్తుంది.
సాధారణ ప్రమాద మరణాలకు కొన్ని కేటగిరీల్లో రూ. 1.50 కోట్ల కంటే ఎక్కువ కవరేజ్ అందుతుంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2024లో సింగరేణిలో, జూన్ 2024లో విద్యుత్ శాఖలో ప్రారంభించి, ప్రస్తుతం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందితో సహా అందరికీ వర్తింపజేశారు.








