- ఒకే కెమెరాతో పలు ఉల్లంఘనలను పట్టేసే ‘MVDS’ సాంకేతికత..
- పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్!
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై వేగ పరిమితి దాటడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి పలు రకాల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు.
అత్యంత ఆధునిక సాంకేతికతతో పనిచేసే “మల్టీ వయోలేషన్ డిటెక్షన్ సిస్టమ్” (MVDS)ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇకపై రోడ్డుపై ఉన్న ఒకే ఒక్క కెమెరా సహాయంతో ఏకకాలంలో పలు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ఏఐ (AI) వీడియో అనలిటిక్స్ ద్వారా ఈ వ్యవస్థ క్షణాల్లో గుర్తిస్తుంది.
శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, ఐపీఎస్ నాన్‌రామ్‌గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) కంట్రోల్ రూమ్‌ను సందర్శించి ఈ నూతన సాంకేతికత పనితీరును స్వయంగా సమీక్షించారు.
ఒకే కెమెరాతో మల్టిపుల్ డిటెక్షన్..
ఇప్పటివరకు వివిధ రకాల ఉల్లంఘనలకు వేర్వేరు కెమెరాలు వాడాల్సి రాగా, కొత్తగా తీసుకొచ్చిన సింగిల్ కెమెరా MVDS సిస్టమ్ ద్వారా ఒకే చోట అత్యధిక వేగం, లేన్ డిసిప్లిన్, మొబైల్ డ్రైవింగ్, సీట్‌బెల్ట్ వంటి పలు అక్రమాలను ఒకేసారి రికార్డ్ చేయవచ్చు.
కంట్రోల్ రూమ్ నుంచి ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలను రియల్ టైమ్‌లో ఎలా పర్యవేక్షిస్తున్నారు, ఆటోమేటెడ్ విధానంలో చలాన్లు ఎలా జనరేట్ అవుతున్నాయనే విషయాలను సీపీ పరిశీలించారు.
సైబరాబాద్ – HGCL ఉమ్మడి వ్యూహం..
ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ క్రమశిక్షణను మెరుగుపరచడానికి సైబరాబాద్ పోలీస్ మరియు హెచ్‌జీసీఎల్ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ వాడటం వల్ల మానవ ప్రమేయం లేకుండానే మానిటరింగ్ వేగవంతం కానుంది.







