- 100 శాతం టారిఫ్‌ల ముప్పు!
Trump Signs Russia Sanctions Bill రష్యా నుంచి చమురు, సహజ వాయువు (గ్యాస్) కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలను (టారిఫ్‌లు) విధించేందుకు అధికారం కల్పించే కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
“లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” పేరిట తెచ్చిన ఈ నూతన చట్టం అమలులోకి రావడంతో.. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశం మరియు చైనాలకు తీవ్రమైన ఆర్థిక, వ్యాపార ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఈ బిల్లును 262-159 ఓట్ల తేడాతో ఆమోదించిన రెండు రోజుల వ్యవధిలోనే అధ్యక్షుడు ట్రంప్ దీనికి ఆమోదముద్ర వేశారు.
ఏమిటీ రష్యా ఆంక్షల చట్టం?
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి అవసరమైన ఆర్థిక వనరులను తుంచేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. రష్యన్ బ్యాంకులు, ఇంధన రంగాలు, రక్షణ రంగాలు మరియు ఆంక్షలను దాటవేసే రష్యా ‘షాడో ఫ్లీట్’ ఓడలను లక్ష్యంగా చేసుకుంది.
రష్యన్ వస్తువులపై 500% టారిఫ్..
రష్యాకు చెందిన ఉత్పత్తులపై నేరుగా 500 శాతం వరకు టారిఫ్ విధించేలా చట్టంలో నిబంధన చేర్చారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ లేదా గ్యాస్‌ను అత్యధికంగా కొనుగోలు చేసే ప్రధాన 5 దేశాలతో పాటు, ఆంక్షల నుంచి రష్యాను కాపాడే మూడో దేశాలకు చెందిన దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే విచక్షణారహిత అధికారాన్ని ట్రంప్‌కు ఈ చట్టం కట్టబెట్టింది.
ఉక్రెయిన్‌కు తీవ్ర మద్దతుదారుడిగా నిలిచిన సెనెటర్ లిండ్సే గ్రాహం జూలైలో కైవ్ పర్యటన ముగించుకుని వచ్చిన కొద్ది రోజులకే కన్నుమూశారు. ఆయన గౌరవార్థం ఈ చట్టానికి ఆయన పేరు పెట్టారు.
భారత్‌పై పడే ప్రభావం ఎంత?
ఈ చట్టం భారత్‌పై ఆటోమేటిక్‌గా 100% టారిఫ్‌ను విధించదు. అయితే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్, చైనా, యుఎఇ, టర్కీ వంటి 10 దేశాలను జాబితాలో చేర్చినందున, ట్రంప్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఈ టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది.
ఒకవేళ ట్రంప్ గనుక ఈ 100% టారిఫ్ విధిస్తే, అది ఇప్పటికే అమెరికా విధిస్తున్న పన్నులపై అదనపు భారంగా మారనుంది. గతేడాది రష్యన్ క్రూడ్ ఆయిల్ విక్రయాల కారణంతో అమెరికా భారత్‌పై 25% అదనపు పన్నులు విధించినప్పటికీ, ఫిబ్రవరి 2026 నాటి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా వాటిని ఉప సంహరించు కున్నారు. అయితే ప్రస్తుత చట్టం మళ్లీ ఆందోళనలను రేకెత్తిస్తోంది.
ఘాటుగా స్పందించిన భారత్..
అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లును ఆమోదించిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, తమ దేశ ప్రయోజనాలు, ఇంధన భద్రత కోసం ఎంతటి కీలక చర్యలైనా తీసుకుంటామని స్పష్టం చేసింది.
“140 కోట్ల మంది భారత ప్రజల ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, విభిన్న మూలాల నుంచి చమురు సేకరిస్తాం. ఈ అంశంపై ఇప్పటికే అమెరికా ఉన్నతాధికారులతో చర్చించాం. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావాన్ని వారికి స్పష్టంగా వివరించాం.” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.







