Cm Revanth Reddy At Davos | న్యూయార్క్ ( Newyork ), టోక్యో ( Tokyo ) లాంటి నగరాల స్థాయికి హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ( WEF ) ఆధ్వర్యంలో దావోస్ లో జరిగిన “కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్” ( Country Strategic Dialogue ) రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని అన్నారు. ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాలతో సరిహద్దులతో పాటు నదులు, కృష్ణా మరియు గోదావరి నీటిని కూడా పంచుకుంటున్నామని గుర్తుచేశారు.
దేశీయ రాష్ట్రాలతో పోటీ పడటం కాకుండా చైనా ప్లస్ వన్ కంట్రీకి తెలంగాణ గమ్యస్థానంగా ఉంటుందన్నారు. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న భారత ప్రధానమంత్రి లక్ష్యసాధనలో భాగంగా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకుపోతోందని తెలిపారు.