Chiranjeevi Emotional Post On Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ భారీ విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాను ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం పొల్లాచ్చిలో ఉన్నప్పటికీ.. తన మనసంతా హైదరాబాద్ లో ఉన్న ‘పెద్ది’ సినిమా దగ్గరే ఉండిపోయిందని చిరు పేర్కొన్నారు.
‘పెద్ది’ సాధించిన ఘన విజయంపై చిత్రబృందానికి, ముఖ్యంగా తన కుమారుడు రామ్ చరణ్‌కు చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
“గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ నేను చాలా దగ్గర నుంచి చూశాను. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి చరణ్ అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని చిరు కొనియాడారు.
కష్టానికి దక్కిన ప్రతిఫలం..
సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న అపారమైన ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే తనకు ఒక తండ్రిగా మాత్రమే కాదు.. ఒక తోటి నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోందని, చరణ్ కష్టానికి దక్కిన సరైన ప్రతిఫలమే ఈ విజయం అని సంతోషం వ్యక్తం చేశారు.
ఇంతటి అద్భుతమైన కథను రాసి, దాన్ని అంతే అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించినందుకు దర్శకుడు బుచ్చిబాబును చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణంగా నిలవాలని, భవిష్యత్తులో ఈ చిత్రం మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మెగాస్టార్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.







