Man Sets Ola Scooter On Fire Outside Showroom | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో సమస్య వచ్చిందని షోరూం కు తీసుకెళ్తే సిబ్బంది తన సమస్యను పట్టించుకోలేదని ఆగ్రహించిన ఓ కస్టమర్ తన స్కూటర్ కు నిప్పుపెట్టాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
రాష్ట్రంలోని పాలన్పూర్ లో సాహిల్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఐదేళ్ల కుమారుడితో కలిసి షాపింగ్ కు వెళ్ళాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో వారు అదుపుతప్పి కిందపడిపోయారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం సాహిల్ తన స్కూటర్ ను తీసుకుని ఓలా షోరూం కు వెళ్లారు.
అయితే సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదని, స్కూటర్ ను రిపేర్ చేయడానికి బాధ్యత తీసుకోవడం లేదని సాహిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్ని సార్లు షోరూం చుట్టూ తిరిగినా తన సమస్యను పట్టించుకోలేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తాజగా షోరూం ముందే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.









