- సోషల్ మీడియాలో పొలిటికల్ వార్!
Gudivada Amarnath Makeup Minister Comments | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలోని ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వైరి పక్షాల మధ్య మాటల యుద్ధం కాస్తా.. ‘మేకప్’, ‘గుడ్డు’ కథల చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలకు దారితీసింది.
గుడివాడ అమర్నాథ్ ‘మేకప్’ విమర్శలు..
రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంలోని సదరు మహిళా మంత్రిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
“రాష్ట్రంలో ఒక మేకప్ మంత్రి ఉన్నారు. ఆమె గనుక ఎండలో తిరిగితే.. ముఖానికి వేసుకున్న కేజీ మేకప్ మొత్తం బయటపడుతుంది” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమి శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
‘మరో గుడ్డు పగులుతుంది’.. టీడీపీ ఘాటు కౌంటర్..
గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై అధికార తెలుగుదేశం పార్టీ (TDP) సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించింది. వైసీపీ వైఖరిని తప్పుబడుతూ ఎక్స్ (ట్విట్టర్) లో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
“ఇది గొడ్డలి పార్టీ సంస్కృతి..! సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి హేళనగా మాట్లాడటానికి సిగ్గుండాలి.
మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు.. మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా జగన్? లేక దళిత మహిళలు అంటే మీకు అంత చులకనా?” అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది.
వైసీపీ నాయకుల అహంకారానికి, వారి ఉచిత గుడ్డు కథలకే గత ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి “గుడ్డు” పగలగొట్టారని టీడీపీ ఎద్దేవా చేసింది.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని, లేదంటే ఈసారి ప్రజల చేతుల్లో మరో “గుడ్డు” పగలడం ఖాయమంటూ అధికార పార్టీ గట్టిగా హెచ్చరించింది. మహిళా మంత్రిపై చేసిన ఈ వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.








