Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సూపర్ ఎల్‌నినోపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు..!

సూపర్ ఎల్‌నినోపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు..!

  • నీటి వృథా అరికట్టాలని పిలుపు

Pawan Kalyan On Super El nino | రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన సాగునీటి కొరతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని చెప్పారు. కాలువల్లో పూడిక తొలగింపు, గట్ల లీకేజీల నివారణ వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని అధికారులకు సూచించారు.

డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులు, నీటి నిల్వలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

రైతుల్లో నీటి కొరతపై అవగాహన పెంచాలని పవన్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అన్నారు. రైతుల ఆందోళన తగ్గించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతుల అవసరాల కోసం ఏలేరు ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని వివరించారు.

సమావేశంలో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా మంత్రి నిమ్మల ఆరా తీశారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, ప్రజాసేవలో మరింత చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions