Rahul Gandhi on Fuel price hike | పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. ఎన్నికలు ముగిసిన వెంటనే దేశంలో ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయని ఆయన జోస్యం చెప్పారు.
ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు. బుధవారం నాటితో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో, పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపునకు మోదీ సర్కారు సిద్ధమైందని రాహుల్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ లాభాన్ని ప్రజలకు అందించకుండా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని, ఇప్పుడు ధరలు పెరగగానే ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని ఆయన మండిపడ్డారు.
ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం సామాన్యుడిని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అస్సాం, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ బుధవారంతో ముగుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు కూడా పూర్తవుతున్న వేళ రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.







