BRS ‘Chalo Bus Bhavan’ Protest | హైదరాబాద్ ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆరెస్ ‘చలో బస్ భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బీఆరెస్ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి మరియు ఇతర నాయకులు బస్ భవన్ వద్దకు చేరుకున్నారు.
అలాగే బీఆరెస్ శ్రేణులు భారీగా అక్కడికి తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన గులాబీ నేతలు బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ సర్కారు అడ్డగోలుగా ఛార్జీలు పెంచిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మహిళలకు ఉచితం అని పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేసి, బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబాల మీద భారం పడదా అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుపుతుందో, సర్కస్ నడుపుతుందో వాళ్ళకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. రౌండ్ ఫిగర్, టోల్ గేట్, పండుగలు అని, బస్సు పాసులు, సిటీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు సబ్ చార్జీలు అని ఇలా టికెట్ చార్జీలు పెంచుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు.









