Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలు.. ‘అల్పాహార పథకం’ ప్రారంభం!

తెలంగాణలో తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలు.. ‘అల్పాహార పథకం’ ప్రారంభం!

TG Govt Schools Reopen Breakfast Scheme | వేసవి సెలవుల అనంతరం తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సోమవారం (జూన్ 15, 2026) తిరిగి తెరుచుకున్నాయి. సుదీర్ఘ సెలవుల తర్వాత మళ్లీ బడి గడప తొక్కిన విద్యార్థుల రాకతో పాఠశాలలన్నీ కోలాహలంగా మారి, పండుగ వాతావరణం సంతరించుకుంది.

పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు ఊరటనిస్తూ అటు విద్యాసంవత్సరం ప్రారంభంతో పాటు ఇటు ప్రతిష్టాత్మక ‘అల్పాహార పథకం’ (Breakfast Scheme) కూడా రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా శ్రీకారం చుట్టుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఈ అల్పాహార పథకం సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది.

విద్యార్థులకు వడ్డించిన మంత్రి..

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి స్వయంగా విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించారు.

లక్షలాది మందికి లబ్ధి..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,269 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకం ఒకేసారి ప్రారంభమైంది. దీని ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్ కాలేజీలకు వెళ్లే దాదాపు 1.44 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం ఉచితంగా పౌష్టికాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందనుంది.

తొలిరోజే పుస్తకాల పంపిణీ..

బడి తెరిచిన మొదటి రోజే విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా విద్యాశాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు తొలిరోజే పాఠ్య పుస్తకాలు (Textbooks), నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఉపాధ్యాయులు విజయవంతంగా పూర్తి చేశారు. ఉచిత అల్పాహారం, చేతికి కొత్త పుస్తకాలు అందడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
‘రెండు దశాబ్దాల’ ప్రజాసేవ. సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions