K Annamalai Clarifies On CJP Protests తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ‘వీ ది లీడర్స్’ (We the Leaders) ఉద్యమ స్థాపకుడు కే. అన్నామలై ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు తీసుకున్న కఠిన చర్యలను తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో గురువారం తన ‘వీ ది లీడర్స్’ వేదికగా మాట్లాడిన అన్నామలై.. సిజెపి (CJP) కి తాను మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై కీలక స్పష్టత ఇచ్చారు.
సిజెపికి మద్దతు లేదు కానీ..:
“మేము ఎప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వం. వారి ఎజెండా వేరు, మా ఎజెండా వేరు” అని అన్నామలై తేల్చి చెప్పారు. అయితే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా శాంతియుతంగా పోరాడే హక్కు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
చీఫ్ ఎలక్షన్ కమీషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన సిజెపి నాయకులను అరెస్ట్ చేసిన తీరును ఆయన ఆక్షేపించారు. “దేశ సార్వభౌమాధికారానికి ముప్పు ఉంటే IB, RAW వంటి ఐబీ సంస్థలను ఉపయోగించి విచారణ జరిపి జైల్లో పెట్టండి.. కానీ సోషల్ మీడియా (X) వేదికగా కల్పిత కథనాలు ప్రచారం చేసి దేష్యద్రోహులుగా చిత్రీకరించవద్దు” అని హితవు పలికారు.
ప్రధాని మోదీపై ప్రశంసలు.. కానీ..
ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం మంచి పని చేస్తున్న మంచి ప్రధాని అని కొనియాడిన అన్నామలై.. ప్రధానికి మద్దతు ఇస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే ప్రశ్నించడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. బీజేపీకి ప్రశ్నించే హక్కును గుర్తుచేస్తూ, తనకూ ఎవరి వద్ద నుంచో దేశభక్తి పాఠాలు వినాల్సిన అవసరం లేదని ధీటుగా బదులిచ్చారు.
ఇటీవల ఢిల్లీ రామ్లీలా వేడుకల్లో భాగంగా సిజెపి గుర్తుగా ఉన్న ‘కాక్రోచ్’ దిష్టిబొమ్మను బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ ఆధ్వర్యంలో దహనం చేయడాన్ని అన్నామలై ప్రశ్నించారు. “గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. సిజెపిని వ్యతిరేకిస్తోందో లేక దానికి ఉచిత ప్రచారం కల్పిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తోందో అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి తీవ్రంగా స్పందించారు. అన్నామలై ‘శాంతియుత నిరసనలకు’, ‘ఉద్దేశపూర్వక చట్ట ఉల్లంఘనలకు’ మధ్య తేడాను మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు. జూన్ 2026లోనే అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారని, ఆయనకు విమర్శించే హక్కు ఉందంటూ ఎద్దేవా చేశారు.











