India Hits 100 Medals In Asian Para Games | జపాన్‌లోని నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో భారత పారా అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. శుక్రవారం జరిగిన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో భారత అథ్లెట్లు సందీప్, హానీ లు ప్రపంచ రికార్డు స్థాయి ప్రదర్శనలతో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ అద్భుత విజయాలతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య ఏకంగా 100 మార్కును దాటింది.
వరల్డ్ రికార్డులతో భారత్ పసిడి కాంతి..
400 మీటర్ల పరుగు (T64 ఫైనల్): సందీప్ 52.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన నూర్ అల్సానా (53.13 సెకన్లు) రజతం సాధించగా, భారత్‌కే చెందిన అజయ్ కుమార్ (53.61 సెకన్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
జ్యావెలిన్ త్రో (F37/38 ఫైనల్): హానీ ఈటెను 60.49 మీటర్ల దూరానికి విసిరి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పుతూ పసిడి పతకం సాధించాడు. ఇరాన్‌కు చెందిన హోర్మోజ్ (50.68 మీటర్లు) రజతం, చైనాకు చెందిన యు చెంగ్‌జీ (53.66 మీటర్లు) కాంస్యం సాధించారు. (గమనిక: F37/38 కేటగిరీ విభాగాల్లో అథ్లెట్ల అర్హతను బట్టి ‘రాజా పాయింట్ల’ (Raza Points) ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు).
రజత పతకాలు సాధించిన నిమిష, ప్రమోద్..
లాంగ్ జంప్ (మహిళల T47): భారత అథ్లెట్ నిమిష కొక్కినాపరంబిల్ 5.37 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకకు చెందిన ధనంజన (5.52 మీటర్లు) స్వర్ణం దక్కించుకుంది.
1500 మీటర్ల పరుగు (పురుషుల T46): ప్రమోద్ బిజార్నియా 4:09.65 నిమిషాల్లో రేసును ముగించి భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. శ్రీలంకకు చెందిన వాహుంపురగే (4:03.25) స్వర్ణం సాధించాడు.
అలాగే, డిస్కస్ త్రో (F11) ఫైనల్లో భారత్‌కు చెందిన ప్రవీణ్ శర్మ (30.64 మీటర్లు), షాట్‌పుట్ (F46) ఫైనల్లో అమీషా రావత్ (11.16 మీటర్లు) నాలుగో స్థానాల్లో నిలిచి తృటిలో పతకాలను చేజార్చుకున్నారు.











