Friday 23rd October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తమిళనాడు ప్రజాప్రతినిధుల కార్లపై సీలింగ్!

తమిళనాడు ప్రజాప్రతినిధుల కార్లపై సీలింగ్!

  • రూ. 26 లక్షల గరిష్ఠ పరిమితి!
  • సీఎం విజయ్ కీలక నిర్ణయం!

TN Government Cap On Official Vehicles తమిళనాడు ప్రభుత్వం మంత్రులు, శాసనసభ్యులకు (ఎమ్మెల్యేలు) కేటాయించే అధికారిక వాహనాల కొనుగోలుపై నూతన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది.

విలాసవంతమైన వాహనాల కొనుగోలుకు అడ్డుకట్ట వేస్తూ, మంత్రులు మరియు ఇతర ప్రజాప్రతినిధుల అధికారిక వాహనాల గరిష్ఠ ధరపై స్పష్టమైన పరిమితులను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘శాసనసభ్యుల ప్రయాణ భత్యం నిబంధనల’కు సవరణలు చేస్తూ ప్రభుత్వం కొత్త గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మంత్రులు, ఉన్నతాధికారులు: మంత్రులతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, ప్రభుత్వ చీఫ్ విప్‌లకు కేటాయించే వాహనం గరిష్ఠ ధర రూ. 26 లక్షలకు మించకూడదు. మిగతా శాసనసభ్యులందరికీ ఈ పరిమితిని రూ. 15 లక్షలుగా ఖరారు చేశారు.

ఈ గరిష్ఠ ధరలోనే వాహనం ఎక్స్-షోరూమ్ ధర, పన్నులు (Taxes), రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మోటారు ఇన్సూరెన్స్ ప్రీమియంలు కలిసి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఏటా ఈ ధరల పరిమితిపై 5 శాతం పెంపునకు అనుమతి ఇచ్చారు.

GeM పోర్టల్ ద్వారానే కొనుగోలు..

వాహనాల కొనుగోలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వానికి చెందిన “గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్” (GeM) పోర్టల్ ద్వారానే చేపట్టాలి. అలాగే, కొనుగోలు చేసే వాహనాలు తప్పనిసరిగా భారత్ స్టేజ్-VI (BS-VI) ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

మంత్రుల వాహనాలను తమిళనాడు ప్రభుత్వం తన పేరుపైనే కొనుగోలు చేస్తుంది. స్పీకర్, ఇతర ప్రజాప్రతినిధుల వాహనాల కొనుగోలును అసెంబ్లీ సచివాలయం పర్యవేక్షిస్తుంది. పదవీకాలం ముగిసినా, లేదా అనర్హత వేటు పడినా వాహనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి.

అయితే సాధారణ ఎమ్మెల్యేలు తమ వాహన మరమ్మతులు, ఇంధనం, డ్రైవర్ వేతన ఖర్చులను తమకు వచ్చే ప్రయాణ భత్యం నుంచే భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు తమిళనాడు పబ్లిక్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఇ. సుందరవల్లి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

You may also like
వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
అమిత్ షా 62వ పుట్టినరోజు: ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు!
ఇన్‌స్టాగ్రామ్‌ లోకి సోనియా గాంధీ ఎంట్రీ.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే!
new trains from hyderabad
మొబైల్స్‌లో పెద్ద శబ్దాలతో పాటలు వింటే జైలుకే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions