Monday 19th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మొబైల్స్‌లో పెద్ద శబ్దాలతో పాటలు వింటే జైలుకే!

మొబైల్స్‌లో పెద్ద శబ్దాలతో పాటలు వింటే జైలుకే!

new trains from hyderabad
  • రైల్వే శాఖ సంచలన ఆదేశాలు!

Southern Railway Rules Mobile Phone Noise Penalty Jail రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తిస్తే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొబైల్‌ ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు వినడం, వీడియోలు చూడటం, లేదా ఫోన్‌లో గట్టిగా మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని దక్షిణాది రైల్వే (Southern Railway) స్పష్టం చేసింది. ఈ మేరకు తన పరిధిలోని రైళ్లు, స్టేషన్లలో పెద్ద శబ్దాలను నియంత్రించేందుకు కఠినమైన కొత్త ఆదేశాలను జారీ చేసింది.

చెన్నైలోని దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం జారీ చేసిన ఈ మార్గదర్శకాల ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలిసారి రూ.1,000 వరకు జరిమానా విధించనున్నారు. ఒకవేళ హెచ్చరించినా పదేపదే ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే ఆరు నెలల వరకు సాధారణ జైలు శిక్ష, రూ.5,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

ప్రశాంతతకు భంగం వాటిల్లుతోంది..

రైళ్లు, స్టేషన్లలో మొబైల్ స్పీకర్ల ద్వారా పెద్ద శబ్దాలతో పాటలు, రీల్స్, వీడియోలు ప్లే చేయడం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు, విశ్రాంతి తీసుకోవాలనుకునే తోటి ప్రయాణికులకు తీవ్ర ప్రశాంతత లోపిస్తోందని రైల్వే శాఖ పేర్కొంది. ప్రయాణికులకు ఈ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు రైళ్లు, స్టేషన్లలో హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో మైక్ ద్వారా ప్రకటనలు చేయాలని అన్ని రైల్వే డివిజన్లను ఆదేశించింది.

ఇయర్‌ఫోన్లు తప్పనిసరి..

ప్రయాణికులు మొబైల్‌లో పాటలు లేదా వీడియోలు చూసేటప్పుడు విధిగా ఇయర్‌ఫోన్లు (Earphones) ఉపయోగించాలని, ఫోన్లలో ఇతరులకు డిస్టర్బ్ అయ్యేలా గట్టిగా మాట్లాడకూడదని సూచించింది. ఫోన్లను సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్‌లో ఉంచుకోవాలని కోరింది.

రైల్వే చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే..

రైల్వే చట్టంలోని సెక్షన్ 145 ప్రకారం.. రైల్వే ప్రాంగణంలో ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవచ్చని, అవసరమైతే వారిని రైలు నుంచి దింపేయడంతో పాటు టికెట్లను స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు ఉంటుందని తెలిపింది. ఈ నిబంధనల అమలుకు సంబంధించి తీసుకున్న చర్యల నివేదికలను 2026 అక్టోబర్ 20లోగా ప్రధాన కార్యాలయానికి పంపాలని సంబంధిత డివిజన్లను రైల్వే యంత్రాంగం ఆదేశించింది. ప్రయాణికులందరికీ అత్యంత ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు.

You may also like
అపరిశుభ్రమైన టాయిలెట్ ఫోటో పంపితే రూ.1000 FASTag రీఛార్జ్!
Rahul Gandhi on Women's Reservation Bill 2026
ఎలోన్ మస్క్ ‘స్టార్‌లింక్’ వివాదంలో దూరి అడ్డంగా బుక్కైన కాంగ్రెస్!
ఎన్నికల సంఘంపై దాడి ప్రజాస్వామ్యానికే ప్రమాదం!
“డజన్ మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు భార్యలు”: సీఎం డీకే కామెంట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions