PV Sindhu Responds To Trolling On Silver Bathukamma బతుకమ్మ సంప్రదాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తనపై వస్తున్న ట్రోల్స్, విమర్శలపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తనకు వెండి బతుకమ్మను బహుమతిగా అందించడంపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఆమె స్పష్టమైన వివరణ ఇచ్చారు. అత్తగారు చూపిన ప్రేమకు, ఆప్యాయతకు అది ప్రతీక అని స్పష్టం చేశారు.
తొలిసారి బతుకమ్మ వేడుకలు..
తన పుట్టింట్లో సంప్రదాయబద్ధంగా బతుకమ్మ జరుపుకొనే ఆచారం లేదని, అందుకే తెలంగాణకు చెందిన కరీంనగర్ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన తర్వాతే తాను తొలిసారి ఈ పండుగలో పాల్గొన్నట్లు సింధు తెలిపారు. పండుగ కోసం తన వెనుక కనిపిస్తున్న పెద్ద పూల బతుకమ్మను తానే రోజంతా శ్రమించి ఎంతో భక్తిశ్రద్ధలతో పేర్చినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకున్నట్లు వెల్లడించారు.
వెండి బతుకమ్మ వెనుక ఆప్యాయత..
కొత్త కోడలిని తనకు ఎంతో ఇష్టమైన సంప్రదాయంలోకి సాదరంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే అత్తగారు ఆ వెండి బతుకమ్మను ఎంతో ప్రేమగా బహుమతిగా ఇచ్చారని తెలిపారు. సంప్రదాయంతో పాటు అందులో తల్లి ప్రేమ కూడా దాగి ఉందని పేర్కొన్నారు. సంప్రదాయాల వెనుక ఉన్న భావోద్వేగాలను, ఆప్యాయతను అర్థం చేసుకోకుండా కేవలం విమర్శలు చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. సింధు ఇచ్చిన ఈ స్పష్టతకు పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.











