Kishan Reddy At Amberpet Mahila Sadasu కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళా శక్తికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కొనియాడారు. అంబర్పేటలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 17వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు అంబర్పేట ప్రాంత ప్రజలంతా బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మహిళల సాధికారత, నిజాం వ్యతిరేక పోరాటంలో బతుకమ్మ పాత్ర, అలాగే నేటి యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకునే పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఆనాటి చారిత్రక చీకటి రోజులను, ఆడబిడ్డలపై జరిగిన దౌర్జన్యాలను ప్రస్తావించారు.

అన్ని రంగాల్లోనూ మహిళలే ముందంజ..
దేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము దేశ రాష్ట్రపతిగా, తెలంగాణ కోడలు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. విమానాలు, యుద్ధ విమానాలు నడపడం, సైన్యం, ఐటీ రంగాలు మరియు కంపెనీల సారథ్యంలో మన ఆడబిడ్డలే ముందున్నారని తెలిపారు.
ఆసియా క్రీడల్లోనూ అత్యధిక పతకాలు మహిళలే సాధించారని అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పొదుపు సంఘాలకు (మహిళా సంఘాలకు) రూ. 20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ ప్రోత్సాహం అందిస్తోందని వెల్లడించారు.
డ్రగ్స్ రహిత సమాజానికి పిలుపు..
యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ లాంటి పరిస్థితి తెలంగాణకు రాకుండా తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని హెచ్చరించారు. 2029 నాటికి ‘నషా ముక్త భారత్’ (డ్రగ్స్ రహిత భారత్) సృష్టించడమే ప్రధాని మోదీ ధ్యేయమని, దీనిపై నవంబర్లో హైదరాబాద్లో రాజకీయాలకు అతీతంగా నిర్వహించే పాదయాత్రలో తెలంగాణ ఆడబిడ్డలందరూ పాల్గొనాలని కోరారు.










