UNMARRIED FARMERS MARRIAGE SCHEME కర్ణాటకలోని పిరియాపట్నంలో నిర్వహించిన ‘ప్రజాసేవ’ కార్యక్రమంలో ఒక రైతు ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు వినూత్న విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 35 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతు యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని, వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి పెళ్లి సంబంధాలు దొరికేలా చూడాలని కోరారు. సొంత ఇల్లు, స్థిరాస్తులు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసే యువకులకు కూతుళ్లను ఇచ్చేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపడం లేదని సదరు రైతు ముఖ్యమంత్రి ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పెళ్లిళ్లు కాక తీవ్ర విరక్తి..
35-40 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లిళ్లు కాకపోవడంతో చాలా మంది రైతు యువకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, కొందరు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సదరు రైతు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆస్తులు ఉన్నా దక్కని సంబంధాలు..
“మా దగ్గర భూములు ఉన్నాయి, ఇళ్లు కట్టుకున్నాం, ఎంతో డబ్బు ఖర్చు చేశాం. కానీ, వ్యవసాయం చేసేవారికి కూతుళ్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు” అని వాపోయారు. “అందరికీ పంటలు పండించి అన్నం పెట్టే రైతు కుటుంబాలకు పిల్లను ఇవ్వకపోతే మేము ఏం చేయాలి? ఇది ఒక్కరి సమస్య కాదు, కర్ణాటక వ్యాప్తంగా లక్షలాది మంది యువకుల సమస్య” అని సదరు రైతు విన్నవించారు.
రైతు విజ్ఞప్తిని విన్న డీకే శివకుమార్ నవ్వుతూ తేలికగా తీసుకున్నప్పటికీ, ఈ సంఘటన స్థానికంగా మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.







