Lok Sabha Strength Increase To 815 Seats | దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది.
జనాభా గణన (Census) మరియు పునర్విభజన (Delimitation) ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచబోతున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను సుమారు 50 శాతం పెంచి 815కు చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం.. పెరిగిన 815 స్థానాల్లో మూడో వంతు అంటే 272 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.
పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే వాదనలను మంత్రి కొట్టిపారేశారు. “ఏ ఒక్క రాష్ట్రం కూడా ప్రస్తుతం ఉన్న సీట్లను కోల్పోదు.
ప్రస్తుతం ఉన్న బలాలను కాపాడుతూనే కొత్త సీట్ల కేటాయింపు జరుగుతుంది” అని ఆయన హామీ ఇచ్చారు. జనాభా నియంత్రణ పాటించినందుకు శిక్షగా దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గిపోతాయని ఇన్నాళ్లూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మేఘవాల్ ఈ ప్రకటన ద్వారా సమాధానమిచ్చారు.
ప్రాతినిధ్యం తగ్గకుండా, కేవలం అదనపు సీట్లను జనాభా ప్రాతిపదికన సర్దుబాటు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
అమలు ఎప్పుడు…
వచ్చే జనాభా గణన పూర్తయిన తర్వాత, దాని ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చే నివేదిక మేరకు ఈ కొత్త స్థానాలు అమల్లోకి వస్తాయి. ఇది పూర్తయ్యాకే మహిళా రిజర్వేషన్లు కూడా పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి.






