Pawan Kalyan on Women Reservation Bill | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది నాగరిక సమాజంలో ఒక చరిత్రాత్మక ముందడుగు అని ఆయన కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పవన్ కల్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది మహిళలకు కొత్తగా ఇస్తున్న హక్కు కాదు, వారికి న్యాయంగా దక్కాల్సిన గౌరవాన్ని తిరిగి ఇవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, వివిధ రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన భారతీయ మహిళా మూర్తులను పవన్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు సవాల్ చేసే హక్కును పొందిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన వైశాలిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇస్రో శాస్త్రవేత్త రీతూ కరిధాల్, క్రీడాకారిణులు పీవీ సింధు, మీరాబాయి చాను, నిఖత్ జరీన్ సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని అన్నారు.
దుర్గాబాయి దేశ్ముఖ్, విజయలక్ష్మీ పండిట్ వంటి మహనీయుల త్యాగాలను గుర్తు చేస్తూ.. ప్రతిభకు అవకాశం తోడైతే మహిళలు ప్రపంచానికే నాయకత్వం వహిస్తారని ఆయన ఉద్ఘాటించారు.
“బలమైన మహిళలు బలమైన కుటుంబాలను నిర్మిస్తారు.. బలమైన కుటుంబాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి” అనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహిళా బిల్లు అమలుతో చట్టసభల్లో నవశకం ప్రారంభం కాబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






