- వరకట్న వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- నిందితుడి అప్పీల్ డిస్మిస్!
Supreme Court On Dowry Death Case | దేశంలో వరకట్న వేధింపులు, వధువుల పట్ల అమానుష ప్రవర్తనపై సుప్రీంకోర్టు శుక్రవారం అత్యంత సంచలన మరియు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
“అసలు అబ్బాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకునేది వారిని, వారి కుటుంబాలను అవమానించడానికేనా? వధువును, ఆమె తల్లిదండ్రులను ఇలాగే నిరంతరం అవమానించడం సాధ్యం కాదనే బలమైన సందేశం సమాజంలోకి వెళ్లాలి” అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ వరకట్న వేధింపుల మరణం కేసులో నిందితుడి అప్పీల్‌ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
వధువు కుటుంబాన్ని ‘యాచకులు’ అంటారా?
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పెళ్లయిన తర్వాత అత్తవారింట్లో వధువులను, వారి కుటుంబాలను ఆర్థికంగా ఎలా పీడిస్తారో (Financial Coercion) కోర్టు ఎత్తిచూపింది. వధువును పీల్చి పిప్పి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని జస్టిస్ నాగరత్న మండిపడ్డారు.
“అమ్మాయి కుటుంబం తమ కూతురిని కాపాడాలని వేడుకుంటుంటే, మీరు వారిని యాచకులు (Beggars) అని పిలుస్తారా? అమ్మాయి తండ్రి తాము రూ. 60,000 ఇవ్వగలమని చెబితే, వారిని అంతలా హీనంగా మాట్లాడతారా?” అని నిందితుల తరఫు న్యాయవాదిపై జస్టిస్ నాగరత్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదువుకున్న వారిలోనే ఇలాంటి ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తోందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారం వ్యక్తం చేశారు.
ఈ వివాదం 2010 నాటి కేసు విచారణకు సంబంధించింది. పెళ్లయిన మూడు ఏళ్ల లోపే ఒక మహిళ చత్తీస్‌గఢ్‌లోని తన అత్తవారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డబ్బు, కారు ఇవ్వాలంటూ భర్త, అతని కుటుంబ సభ్యులు పదే పదే వేధించడమే ఈ మరణానికి కారణమని ట్రయల్ కోర్టు నిర్ధారించింది.
దీంతో నిందితులకు ఐపీసీ సెక్షన్ 304B (వరకట్న మరణం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 498A (క్రూరత్వం) కింద శిక్ష పడింది. దీనిని చత్తీస్‌గఢ్ హైకోర్టు కూడా సమర్థించింది.
సుప్రీంకోర్టులో భర్త తమ్ముడు తనకు కేవలం 498A కిందే శిక్ష పడిందని, ఉపశమనం ఇవ్వాలని కోరగా.. “మీకు కేవలం 498A కింద మూడేళ్ల శిక్ష పడినందుకు సంతోషించాలి” అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానిస్తూ, ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ అప్పీల్‌ను కొట్టివేశారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న 33 ఏళ్ల ట్విషా శర్మ మరణం కేసు నేపథ్యంలో రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.







